రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి…….. తల్లిదండ్రుల సంఘం.. రాయల్ పోస్ట్ న్యూస్/ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకొని, పిల్లలకు నాణ్యమైన విద్యా, నాణ్యమైన భోజనం అందించాలని ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో తల్లిదండ్రుల తో కలిసి ఆయన కలెక్టర్ పమేలా సత్పతి కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రిన్సిపాల్, తల్లిదండ్రులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పిల్లల బాగోగులపై సరియైన సమాధానం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఎస్సీ/ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల పై వివక్ష చూపడం, పిల్లలను చూడడానికి తల్లిదండ్రుల కు అవకాశం కల్పించక పోవడం, కనీసం తల్లులకు పిల్లల డార్మేటరీ వరకు అనుమతి ఇవ్వకపోవడం, రీజనల్ కో-ఆర్డినేటర్ అనుమతి లేకుండా పిల్లలను ప్రైవేటు కార్యక్రమానికి పాఠశాల బయటకు తీసుకెళ్ళడం లాంటి చర్యలతో తల్లిదండ్రులకు అపనమ్మకం కలిగే విధంగా ప్రిన్సిపాల్ ప్రవర్తిస్తుందని ఆయన అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యా, నాణ్యమైన భోజనం అందించడం లేదని, పురుగుల ఆహారం తినలేక ప్రిన్సిపాల్ కు పిల్లలు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా, ఇష్టముంటే ఉండండి, లేకుంటే టీ సీ తీసుకొని వెళ్ళిపోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుందని ఆయన అన్నారు. గతంలో రీజనల్ కో- ఆర్డినేటర్ కు ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదని కలెక్టర్ తెలిపారు. సమగ్ర విచారణ జరిపి, ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఆలేరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు తాటికాయల నరేందర్, ప్రధాన కార్యదర్శి కోడి రెక్క సంపత్ కుమార్, స్వామి, దేవేందర్, నర్సింహ, స్వప్న,భాగ్య,ఉమ, రాజు తదితరులు పాల్గొన్నారు.