సైబర్ క్రైమ్ పై పూర్తి అవగాహన ఉండాలి: ఎస్సై ఏడుకొండలు.
రాయల్ పోస్టు 7 సెప్టెంబర్ ప్రతినిధి సంగారెడ్డి
సైబర్ క్రైమ్ పై ప్రతీ ఒక్కరికి పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్వచ్ గురుకుల కార్యక్రమంలో రాయికోడ్ ఎస్సై ఏడుకొండలు అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని అల్లపూర్ గ్రామ శివారులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో సైబర్ క్రైమ్ నేరాల పై స్థానిక ఎస్సై ఏడుకొండలు విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై ఏడుకొండలు మాట్లాడుతూ రెండు ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య ఇంటర్నెట్ సహకారంతో జరిగే నేరాలను సైబర్ క్రైమ్ అంటారని అన్నారు. బ్యాంకు ఖాతా కలిగిన వారికి ఫోన్ ద్వారా ఓటిపి తెలుసుకొని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని, కాబట్టి ఓటిపిని ఏ ఒక్కరికి తెలియనివ్వరాదని అన్నారు. సైబర్ నేరాల గురించి మన కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని కోరారు. కొందరు ప్రొఫైల్ ఫోటో పెట్టి సహకారం కావాలని మెసేజ్ లు పెట్టి మోసగిస్తున్నారని అన్నారు. అలాగే ఇంట్లోనే కూర్చుని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ట్ర్యాప్ లో దించి అనేక రకాలుగా మోసగిస్తున్నారని చెప్పారు. బ్యాంకు అధికారులు ఖాతాదారులకు ఫోన్లు చేయరని , ఎవరో బ్యాంకు ఖాతా రద్దు చేస్తున్నామని చెప్పడంతో నమ్మి మోసపోవద్దని అన్నారు. అలాగే టీవీ షోల పేర్లు చెప్పి బహుమతులు గెలుచుకున్నారని ఆశ చూపి ఇల్లు గుల్ల చేస్తున్నారని అన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం డబ్బులు సైతం ఓటిపి పేరుతో సైబర్ మోసాలకు పాల్పడి కాజేస్తున్నారని అన్నారు. కాబట్టి ఇటువంటి నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థులు ముఖ్యంగా ఆన్లైన్ క్లాస్ లు ఉన్నప్పుడు కానీ, ఫేస్ బుక్, ట్విట్టర్, మోసపూరిత ప్రొఫైల్ ఫొటోలను నమ్మి మోసపోవద్దని వాట్సాప్ డిపి లు లాంటివి నమ్మకూడదని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయి చేరుకోవాలని తెలిపారు. సైబర్ క్రైమ్ బారిన పడి ఎవరైనా మోసపోతే వెంటనే 1930 కు ఫోన్ చేసి పూర్తి సమాచారం ఇస్తే సంబంధిత అకౌంట్ ఫీజింగ్ చేసి రక్షణ కల్పించవచ్చని అన్నారు. అనంతరం ఎస్సై ఏడుకొండలు ప్రిన్సిపాల్ తో పాటు కలియ తిరుగుతూ పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించి, భోజనశాలలో విద్యార్థులతో కలిసి ఎస్సై ఏడుకొండలు బంతి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అల్లపూర్ గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్, గురుకుల ప్రిన్సిపల్ మాన్విచంద్, కానిస్టేబుల్ మహమ్మద్ గౌస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.