— పాలకులు, అధికారుల్లో కొరవడిన చిత్తశుద్ధి

— జిల్లాలో పెట్రేగిపోతున్న అవినీతి

అధికారం మీద ఉన్న యావ సమస్యలపై లేదు

— తెలంగాణ ఉద్యమకారుడు రాయబారపు రమేష్

రాయల్ పోస్ట్ ప్రతినిధి హనుమకొండ.
04-09-2022


అధికారం మీద ఉన్న యావ, ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని, ప్రజలు నానా అవస్థలు పడుతున్నా పట్టింపు లేకుండా పాలన సాగిస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు, దివ్యాంగుల సమస్యల సాధన వేదిక అధ్యక్షుడు రాయబారపు రమేష్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలను బలోపేతం చేసుకోవడంలో నిమగ్నమై ప్రజా సమస్యలను విస్మరించి ఒక పార్టీ మీద, ఒక పార్టీ విమర్శలు, ప్రతి విమర్శలు, అసభ్య పదజాలాన్ని వాడుతూ, దాడులు, అరెస్టులతోనే కాలం వెళ్లబోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్నది పార్టీల బలోపేతాల కోసమేనా..? ప్రజా సమస్యలు వద్దా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి, మాఫీయా రంగాలు పెచ్చురిల్లి పేదల ఉసురు తీస్తుంటే పాలకులు మాత్రం పాలన అంతా బ్రహ్మండంగా ఉందన్న అహంకారంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలతో ఓట్లను కొనుగోలు చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రజా సంక్షేమ పథకాలతో రాష్ట్రం ముందడుగు వేస్తోందని చెప్పుకుంటున్న పాలకులు నీతులు వల్లించడమే తప్ప, క్షేత్రస్థాయిలో శూన్యమని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కుమ్ముక్కై ప్రజా సమస్యలను పక్కనపెట్టి అవినీతి వేటలో మునిగిపోయి ప్రజల సొమ్మును కాజేసుకుంటూ దర్జాగా ప్రజల్లో తిరుగుతున్నారని మండి పడ్డారు. ఇచ్చిన హామీలను అధికారం వచ్చిన తర్వాత తుంగలో తొక్కి వ్యక్తిగత అభివృద్ధిలో లీనమైపోయి ప్రజా స్వామ్య వ్యవస్థను కూనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయనే భ్రమలో ఉండి పదవి లాలనపై మక్కువ పెంచుకుంటున్నారని విమర్శించారు. పథకాలు గెలిపిస్తాయనే ధీమా ఉన్నప్పుడు ఎన్నికలప్పుడు చెమటోడుస్తూ జనం మధ్యలోని వెళ్లాల్సిన అవసరం ఏముందని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా మారడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కుట్ర రాజకీయాలకు ఆజ్యం పోస్తూ వారి డొల్లతనాన్ని ప్రదర్శిస్తున్నారని, ప్రయోజనాలను సంరక్షించడంలో విఫలమై, ఎన్నికలప్పుడు మాత్రం ప్రజలను దగా చేసే పనిలో మునిగిపోవడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా పాలకుల వైఖరిలో మార్పు వచ్చి సంక్షేమ పాలనపై దృష్టిసారిస్తే ప్రజల హృదయాల్లో నిలిచి పోతారని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా మారిన విషయంపై ప్రజలు చైతన్యవంతులు కావాలని ఆయన పిలుపు నిచ్చారు.