ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌళిక వసతుల కల్పనలో అధికారులు విఫలం

రాయల్ పోస్ట్ ప్రతినిధి

మంచిర్యాల జిల్లాలోని విద్యాసంస్థలకు ఫీజు నియంత్రణ చట్టాలు,ప్రభుత్వ ఉత్తర్వులు వర్తించవా అని,జిల్లాలో ఏమైనా ప్రత్యేకమైన చట్టాలు చేశారా అని నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నీరటి రామ్ ప్రసాద్ అన్నారు. సోమవారం రోజున నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు విద్యారంగ సమస్యలు పరిష్కారించాలనే డిమాండ్ తో ధర్నా కార్యక్రమం నిర్వహించి డిఈఓకి వినతిపత్రం సమర్పించారు.అనంతరం రామ్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని విద్యాసంస్థలు వ్యాపార సంస్థలుగా మరి విద్యను వ్యాపారం చేస్తూ విద్యను అందించాల్సిన విద్యాలయాలు పుస్తకాలు,బట్టలు,ప్రతి ఒక్కటీ పాఠశాలలోనే అమ్ముతూ అంగడి బజార్లలాగా మారుతుంటే జిల్లా విద్యాశాఖాధికారికి కన్పించడం లేదా అని ప్రశ్నించారు.స్వయంగా కొందరు విద్యార్థి సంఘాల నాయకులు కొన్ని ప్రైవేట్ సంస్థలు జరుగుతున్న అమ్మకాలను ఆధారాలతో స్వాహా చూపెట్టిన్నప్పటికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. కార్పొరేట్ విద్యాసంస్థల అడ్డాగా రానున్న రోజులలో మంచిర్యాల జిల్లాను చెయ్యడానికి విద్యాశాఖ అధికారులు ఏమైనా కంకుణం కట్టుకున్నారా అర్ధం కావడం లేదన్నారు.అంతేకాకుండా ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌళిక వసతుల కల్పనలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని రామ్ ప్రసాద్ దుయ్యబట్టారు.జిల్లాలోని చాలా వరకు పాఠశాలల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందా అని విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని చదువులు కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు కల్పించడంలో, త్రాగునీటి వసతి కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు.మధ్యాహ్నం పెట్టె భోజనం సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.ఇంత అధ్వాన్నంగా ఎక్కడ ఉండదని అన్నారు.ఒక్కనొక సందర్భంలో రాష్ట్ర మంత్రి వర్యులు కేటీఆర్ ముఖ్యమంత్రి మనవడు,మనవరాలు తినేలాంటి నాణ్యమైన భోజనాన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్నామని అన్నట్టు గుర్తుంది.మరి ఇప్పుడు కనీసం వాళ్ల పిల్లలను ఒక్క పూట ఈ భోజనం తినిపిస్తారా అని ఎద్దేవా చేశారు. బాసర IIIT లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే కనీసం ఈ ట్విటర్ మంత్రికి ట్విట్ చేసే సమయం కూడా లేదా అని అన్నారు
వెంటనే మంత్రి ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు.లేకపోతే రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి స్పందించే అవకాశం లేదని,ట్విట్ లను చూసి స్పందించి సమస్య గురించి రీ ట్విట్ లు చేసి ఊరుకునే ఒక దౌర్భాగ్యమైన పాలన ఉన్న రాష్ట్రంలో జీవిస్తున్నందుకు సిగ్గుగా ఉందని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్, నాయకులు కంబల అజయ్ కుమార్, రమేష్,నగేష్,తదితరులు పాల్గొన్నారు.