రైతు బంధు ఇంకెప్పుడు ఇస్తారు?
పెరిగిన సాగు పెట్టుబడికి ప్రోత్సాహం ఏదీ ?*
అమలుకాని రుణమాఫీ.. వడ్డీ వ్యాపారులతో రైతులకు ఇబ్బందులు* కాంట్రాక్టర్లకు కట్టబడుతున్న ఈజీఎస్ నిధులు*కల్లూరి రాంచంద్రారెడ్డి

రాయల్ పోస్ట్ ప్రతినిధి అలేర్ : రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి వానాకాలం సీజన్ ప్రారంభం అయినప్పటికీ సాగు పెట్టుబడి కోసం రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు డబ్బులు జమ చేయలేదని, ఇంకెప్పుడు జమ చేస్తారని
ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రారెడ్డి
ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా పెంచిన ధరలతో ఇప్పటికే సాగు పెట్టుబడి పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ ధరల వల్ల రైతులకు వ్యవసాయం సాగు పెట్టుబడి పెరిగిందని, పంట రాబడి తగ్గిందన్నారు. పంట రుణాలు సమయానికి ఇవ్వకపోవడం తో పాటు అమలు కాని రుణ మాఫీతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వకపోవడంతో పాటు ధాన్యం కొనుగోలు జాప్యం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయం చేస్తున్న రైతులను ఆదుకోవడం కోసం తక్షణమే ప్రభుత్వం రైతుబంధు డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయడంతోపాటు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీజిల్, ఎరువుల ధరలు పెరిగినందున పెట్టుబడి సాయం కూడా పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భూమి లేని రైతుకూలీలు జీవన స్థితి గతి గ్రామాల్లో దయనీయంగా మారిందని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి కూలీలకు ఉపాధి కల్పించాల్సిన నేటి పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ పథకం నిధులను దారి మళ్ళించి కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నరని విమర్శించారు. కూలీల కడుపు కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం లక్ష్యానికి తూట్లు పొడవకుండా వ్యవసాయ కూలీలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే విధంగా 100 రోజుల నుంచి 250 రోజుల పనిదినాలు ఈ పథకం ద్వారా కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల రైతులతో పాటు రైతు కూలీలకు ఉపాధి కల్పించవచ్చాన్నారు.