భార్య రొట్టెలు చేయలేదని భర్త ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లాలో జరిగిన సంఘటన.
(సంగారెడ్డి రాయల్ పోస్ట్ ప్రతినిది )
ఎంతో విలువైన జీవితాన్ని కొందరు చిన్నచిన్న కారణాలతో బలి చేసుకుంటున్నారు. సిల్లీ కారణంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇంతకీ ఆ కారణమేంటంటే.. అతడి భార్య తన కోసం రొట్టెలు చేయకపోవడం.

భార్య రొట్టెలు చేయలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వినాయకరెడ్డి తెలిపిన ప్రకారం.. బిహార్‌ రాష్ట్రం వైశాలి జిల్లాకు చెందిన మహ్మద్‌ సాబేర్‌ (30) ప్రైవేటు పరిశ్రమలో కార్మికుడుగా పని చేస్తున్నారు. కుటుంబసభ్యులతో సంగారెడ్డి జిల్లా పాశమైలారం గ్రామంలో నివాసం ఉంటున్నారు. పని ముగించుకుని సోమవారం రాత్రి ఇంటికి చేరుకున్న సాబేర్‌.. తన భార్యను రొట్టెలు చేయమని అడిగాడు. ఆమె దానికి నిరాకరించడంతో కాసేపు గొడవపడ్డాడు. భర్తపై కోపంతో ఆమె రొట్టెలు చేయడానికి ఇష్టపడలేదు. ఇది అవమానకరంగా భావించిన సాబేర్ మనస్తాపంతో అర్ధరాత్రి పూట ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన భార్య స్థానికులను పిలిచింది. వారి సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సాబేర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం అతడి ఆత్మహత్యకు గల కారణాన్ని తెలుసుకోవడానికి మృతుడి భార్య, చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.