ఇటీవల హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ను పంజాబ్ పోలీసుల కస్టడీకి అప్పగించేందుకు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు తరలింపు వారెంట్ (ట్రాన్సిట్ వారెంట్) ను కోరుతూ పంజాబ్ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. 

లారెన్స్ బిష్ణోయ్ భద్రతకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని పంజాబ్ ప్రభుత్వ న్యాయవాది అన్మోల్ రతన్ సిద్ధూ వెల్లడించారు.  50 మంది పంజాబ్ పోలీసులు, రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, 12 ఇతర వాహనాలతో లారెన్స్ బిష్ణోయ్ ను తరలిస్తామని, ప్రతి మార్గంలోనూ వీడియో రికార్డింగ్ ఉంటుందని వివరించారు. 

పంజాబ్ పోలీసులు ఢిల్లీ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిలో ఒకటి లారెన్స్ బిష్ణోయ్ అరెస్ట్ కు అనుమతి కోరుతూ దాఖలు చేయగా, మరొకటి అతడి తరలింపును అనుమతించాలని కోరుతూ దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తొలుత అతడి అరెస్ట్ కు అనుమతించింది. అనంతరం, అతడిని భౌతికంగా కస్టడీలోకి తీసుకునేందుకు సమ్మతించింది.