ఇటీవల మహ్మద్ ప్రవక్తపై బహిష్కృత బీజేపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీరిద్దరిపైనా బీజేపీ వేటు వేసినా, విమర్శల దాడికి అడ్టుకట్టపడడంలేదు. ఈ క్రమంలో, దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలను నిరసిస్తూ ఢిల్లీ, కోల్ కతా, హైదరాబాద్, శ్రీనగర్, ఉత్తరప్రదేశ్ లోని మరికొన్ని నగరాల్లో ప్రజలు భారీ రోడ్లపైకి తరలివచ్చారు. 

ఢిల్లీలోని సుప్రసిద్ధ జామా మసీదు వెలుపల నిరసనకారులు పెద్ద ఎత్తున గుమికూడి ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం పవిత్ర ప్రార్థనలు ముగిసిన అనంతరం వారు ఆందోళనకు దిగారు. నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఈ నిరసన ప్రదర్శనతో తమకు సంబంధం లేదని జామా మసీదు షాహీ ఇమామ్ స్పష్టం చేశారు. నేటి ప్రార్థనల అనంతరం కొందరు మసీదు బయట గుమికూడి నినాదాలు చేశారని, ఆ తర్వాత వెళ్లిపోయారని తెలిపారు. ఇప్పుడు పరిస్థితి సాధారణంగానే ఉందని వెల్లడించారు. 

అటు, ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్, ప్రయాగరాజ్, మొరాదాబాద్ లో నిరసనకారులు వీధుల్లో ప్రదర్శన చేపట్టి షాపులు మూసేయించారు. ప్రయాగరాజ్ లో పరిస్థితి అదుపుతప్పి రాళ్లు రువ్వే వరకు వెళ్లింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గతవారం హింస చోటుచేసుకున్న కాన్పూర్ నగరంతో పాటు లక్నో, ఫిరోజాబాద్ లోనూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

హైదరాబాదులోని చార్మినార్ వద్ద, కోల్ కతాలోని పార్క్ సర్కస్ ప్రాంతంలోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. పంజాబ్ లోని లుథియానాలో దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.

కాగా, నుపుర్ వ్యాఖ్యలను ఖండిస్తూ నవీ ముంబయిలో మహిళలు సైతం వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వారు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో బురఖాలు ధరించిన మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.