హైద‌రాబాద్‌లో కల‌క‌లం రేపిన మైన‌ర్ బాలిక‌పై గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న రోజుకో మ‌లుపు తీసుకుంటోంది. ఇప్ప‌టికే ఈ కేసులో నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేసినా… ఈ కేసులో నుంచి కొంద‌రు రాజ‌కీయ నేత‌ల పిల్ల‌ల‌ను కాపాడుతున్నారంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌పై జాతీయ మ‌హిళా క‌మిష‌న్ విచార‌ణ ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో జాతీయ సంస్థ ఈ కేసులో హైదరాబాద్ కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది.

జాతీయ బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ సంస్థ (ఎన్‌సీపీసీఆర్‌) శుక్ర‌వారం హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్‌కు నోటీసులు పంపింది. గ్యాంగ్ రేప్‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు అంద‌జేయాలంటూ స‌ద‌రు నోటీసుల్లో క‌లెక్ట‌ర్‌ను ఆ సంస్థ కోరింది. ఎన్‌సీపీసీఆర్ నుంచి నోటీసులు అందుకున్న క‌లెక్ట‌ర్… ఈ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర వివ‌రాలు అంద‌జేయాలంటూ జూబ్లీ హిల్స్ పోలీసుల‌కు లేఖ రాశారు. పోలీసుల నుంచి వివ‌రాలు అంద‌గానే…క‌లెక్ట‌ర్ వాటిని ఎన్‌సీపీసీఆర్‌ కు నివేదించ‌నున్నారు