రాయల్ పోస్ట్ ప్రతినిధి
బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. కొన్ని రోజుల క్రితం ఇదే విద్యాలయానికి చెందిన పదవ తరగతి విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలుపగా సోమవారం ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ప్రిన్సిపల్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కళాశాల ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ముందుగా బెల్లంపల్లి బజార్ నుండి కళాశాల వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాల ప్రిన్సిపల్ ఎల్లప్పుడూ టీసీ ఇచ్చి పంపిస్తా అని తమను వేధిస్తున్నాడని, అనారోగ్యాల పాలు అయినప్పటికీ సరైన వైద్యం అందించడం లేదని, 150 మంది విద్యార్థులకు రెండు నల్లా పైపులు ఉండగా స్నానాలకు ఇరవై నిమిషాలు మాత్రమే వాటర్ అందిస్తున్నారన్నారు. కళాశాలలో సరైన ఆహారం అందించడం లేదని వారు వాపోయారు. దీంతో అక్కడికి చేరుకున్న ఆర్డిఓ శ్యామల దేవి, తహసీల్దార్ కుమారస్వామి, తాళ్లగురిజాల ఎస్ఐ రాజశేఖర్ లు విద్యార్థులతో మాట్లాడి మళ్లీ ఇలాంటి సమస్యలు పునరావృతం అయితే తమకు తెలియజేయాలని ప్రిన్సిపల్ పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసన విరమించడం జరిగింది.