రాయల్ పోస్ట్ ప్రతినిధి

బెల్లంపల్లి నియోజకవర్గ నిరుద్యోగ యువతకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ శుభవార్త తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసిఆర్ నాయకత్వంలో అన్ని గ్రంధాలయాలు అభివృద్ధి చేస్తున్నామని, దాంట్లో భాగంగానే బెల్లంపల్లిలో గ్రంథాలయం కొరకు పక్కా భవనం నిర్మించడం జరిగిందన్నారు. ఇటీవలే ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేయగా పట్టణంలోని గ్రంథాలయంలో నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. మంచి బోధన బృందంచే ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.శిక్షణ తరగతులలో పాల్గొనే నిరుద్యోగ యువత గ్రంథాలయంలో ముందుగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ దరఖాస్తులకు ఎలాంటి రుసుము ఉండదన్నారు. అదేవిధంగా గ్రంథాలయంలో ఉచిత మధ్యాహ్నం భోజనం కూడా అందించడం జరుగుతుందని, ప్రభుత్వపరంగా అందించాల్సిన అన్ని సౌకర్యాలు అందించడం జరుగుతుందన్నారు.గతంలో 130 మంది జిల్లా నుండి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని ఈ సారి 300 మంది ఉద్యోగాలు సాధించేలా కృషి చేయాలని విద్యార్థులకు తెలిపారు.