రాయల్ పోస్ట్ ప్రతినిధి
బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న పట్టించుకోని మున్సిపల్ శాఖ రెండు రకాల ధోరణి అవలభిస్తుండం పలు విమర్శలకు తావిస్తోంది. బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియా, కన్నాల బస్తి, షంషిర్ నగర్, బెల్లంపల్లి బస్తి, గోల్ బంగ్లా బస్తిలోని పలు వార్డులలోని భూములు కబ్జాకు గురవుతున్నప్పటికీ, అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నపటికీ పట్టించుకోని మున్సిపల్ శాఖ పేదవాడు చిన్న గుడిసె నిర్మించుకుంటే మాత్రం వెంటనే కూల్చివేస్తూ తమ ప్రతాపం చూపుతున్నారు. అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని పలువురు పక్కా సమాచారం ఇచ్చినప్పటికీ సంబంధిత శాఖ పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది.మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న కొన్ని అక్రమ నిర్మాణాలకు ఆఫీస్ నుండి దొంగదారిలో పత్రాలు సృష్టిస్తున్నప్పటికి, మళ్ళీ వాటిని కూల్చి వేసేందుకు సిబ్బంది వచ్చిన సమయంలో పత్రాలు చూసి సిబ్బంది భుజాలు తడుముకుంటుండం విమర్శల పాలవుతుంది. కబ్జా చేసారని కమిషనర్ కు పక్కా సమాచారం ఉన్నప్పటికీ కొన్ని చోట్ల హంగామా చేస్తూ, మరికొన్ని చోట్ల ఉదారత పాటించడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ కమిషనర్ మాత్రం ఏమి జరగడం లేదనే ధోరణిలో వ్యవహరిస్తుండం పలు ఆరోపణలకు దారితీస్తుంది. బెల్లంపల్లి పరిసర ప్రాంతంలోని కెమికల్ సమీపంలోని ఫోర్ లైన్ కు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడం గమనార్హం.ఇప్పటికే అక్కడ చిన్న గదిని ఏర్పాటు చేసి ఏకంగా మున్సిపాలిటీ నుండే అనుమతులు పొందేందుకు మున్సిపల్ కార్యాలయంలో కొందరితో లావాదేవీలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్రస్తుతం కబ్జాకు గురి అయిన ప్రభుత్వ స్థలంకు 40 లక్షల ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రభుత్వ ఆదాయానికి మున్సిపాలిటీ అధికారులు గండికొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలపై నిఘా పెడుతున్నామని అంటున్నప్పటికీ భూ ఆక్రమణలు, నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి.ఇప్పటికైనా సంబంధిత అధికారులు బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కబ్జాలకు గురవుతున్న భూములపై విచారణ చేపట్టి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని, అలాగే నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపల్ శాఖ అధికారులపై చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.