రాష్ట్రానికి చెందిన దర్శనం మొగిలయ్య పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ నుంచి మొగిలయ్య పద్మశ్రీ స్వీకరించారు. పలు విభాగాల్లో ఈ సారి కేంద్ర ప్రభుత్వం 128 పద్మ అవార్డులను ప్రకటించగా.. రెండు విడుతల్లో అవార్డులను ప్రదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇవాళ దివంగత సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, రాధేశ్యామ్‌ ఖేమ్కా (మరణానంతరం) పద్మవిభూషణ్‌, ఎనిమిది మందికి పద్మభూషణ్‌, 54 మందికి రాష్ట్రపతి పద్మశ్రీ అవార్డులను అందజేశారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన మొగిలయ్య పన్నెండు మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆఖరితరం కళాకారుడు. కళాకారుడుగా కిన్నెర పాటలతో ప్రతి ఒక్కరిని తన్మయత్వంలో ముంచెత్తుతున్న మొగిలయ్య. తరాల తెలుగు జీవన విధానం, చారిత్రక గాధలు ఒడిసిపట్టి, పాట రూపంలో కిన్నెర మెట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాద్యం పేరునే ఇంటి పేరుగా మార్చుకుని కిన్నెర మొగిలయ్యగా స్థిరపడ్డారు. తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనను సర్కారు సత్కరించింది. అంతే కాకుండా ఈ వాద్యం ప్రాశస్త్యాన్ని, మొగిలయ్య ప్రతిభను భావితరాలకు తెలిసేలా ప్రభుత్వం 8వ తరగతిలో ఓ పాఠ్యాంశంగానూ చేర్చింది.