తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, మాజీ శాసనసభ్యులు, మల్లు స్వరాజ్యం మృతి పట్ల సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సంతాపం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా ఈరోజు స్థానిక సుందరయ్య భవన్లో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి మహమ్మద్ జహంగీర్ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా పోరాట చరిత్రలోనే శాశ్వతంగా నిలిచిపోయే యోధురాలు అని ఆయన కొనియాడారు. సమాజ మార్పు కోసం చివరి క్షణం వరకు అలుపెరుగని పోరాటం చేసిన వీరవనిత మల్లు స్వరాజ్యం అని ఆయన అన్నారు. ఆమె చరిత్ర మహిళలకు ఆదర్శవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం సాయుధ పోరాటం ముగిసిన తర్వాత ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి ప్రవేశించారు. రెండుసార్లు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి సిపిఎం పార్టీ ఎమ్మెల్యే ఎన్నికయ్యారని అయితే 1978లో మొదటిసారిగా ,1983లో రెండోసారి గా విజయం సాధించారని అంతేకాకుండా ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో స్త్రీల సమస్యలను, వారి పై జరుగుతున్న లైంగిక దాడులను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడంలో ఆమె ఎంతో కృషి చేశారని సమాన పనికి సమాన వేతనం లభించడానికి నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తూనే ,బీడు భూములను రెవిన్యూ డివిజనల్ అధికారి దృష్టికి తీసుకెళ్లి భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేసేలా కృషి చేశారని, అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చైతన్యం చేయడం కోసం అమోఘమైన ప్రతిభను కనబరిచారు అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో సుమారు 10 లక్షల ఎకరాల భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంపిణీ చేసిన మల్లు స్వరాజ్యం అదే స్ఫూర్తితో తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గంలో పేదల కోసం పోరాటం నిర్వహించారు. తన చివరి శ్వాస విడిచే వరకూ ఆరోగ్యం బాగా లేకున్నా ఎర్రజెండాను వదలకుండా ఉన్న గొప్ప నేత అన్నారు. ఆనాడు దొరలు ప్రజలను దోచుకుంటే మేము పోరాడి సాధించుకున్నమని ఈరోజు పెట్టుబడి దారులు, పాలకులు దేశాన్ని దోచుకుంటున్నారని అందుకనే పేద ప్రజలకు ఎర్ర జెండా అండ అవసరం ఎంతైనా ఉందని స్వరాజ్యం గారు పిలుపునిచ్చారు అన్నారు. తన మరణానంతరం శరీరం కూడా ప్రజలకు ఉపయోగపడాలని నల్గొండ మెడికల్ కాలేజీ కి తన పార్ధివదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులను కోరిందని అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మల్లు స్వరాజ్యం గారు భౌతికంగా లేకున్నా ఆమె ఆశయాలను కొనసాగిస్తామని జహంగీర్ పేర్కొన్నారు. నివాళులు అర్పించిన వారిలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు,జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ,మాయ కృష్ణ,మద్దెపురం రాజు,సీనియర్ నాయకులు గద్దె నర్సింహ,గందమల్ల మాత్తయ్య, ఎదునూరి మల్లేశం,గునుగుంట్ల శ్రీనివాస్, సిల్వర్ ఎల్లయ్య, నరాల చంద్రయ్య, sfi జిల్లా కార్యదర్శి వనం రాజు,ఆఫీస్ కార్యదర్శి వడ్డేబోయిన వెంకటేష్ తదితరులు నివాళులర్పించారు.