న్యూఢిల్లీ: ఉక్రెయిన్, రష్యా యుద్ధం అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా పలు దేశాల్లో చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు డబుల్ సెంచరీలు దాటాయి. లీటరు పెట్రోల్ ధర రూ. 254కు చేరగా.. డీజిల్ ధర రూ. 214కు ఎగబాకింది. శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమైంది.నెల రోజుల వ్యవధిలో ఇంధన ధరలను పెంచడం శ్రీలంకలో ఇది మూడోసారి. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ద్వీప దేశంలో ఇంధన ధరలు గరిష్ట స్థాయికి చేరడం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లయింది. శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమై డాలర్‌తో పోలిస్తే 57 రూపాయలకు తగ్గింది. రూపాయి విలువ క్షిణించడం ఏడు రోజుల్లో ఇది రెండోసారి.