న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు భగ్వంత్ మాన్ సన్నాహాలు సాగిస్తున్నారు. శుక్రవారంనాడు ఆప్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన ఆయన శనివారంనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌ను కలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు తమను ఆహ్వానించాలని గవర్నర్‌ను భగ్వంత్ మాన్ కోరారు. గవర్నర్ రాజ్‌భవన్‌‌కు ఆయనతో పాటు ఆప్ పంజాబ్ ఇన్‌చార్జి రాఘవ్ చద్దా కూడా వెళ్లారు.
గవర్నర్‌తో సమావేశం అనంతరం మీడియాతో భగ్వంత్ మాన్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను గవర్నర్‌కు సమర్పించామని, ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరామని చెప్పారు. ఎప్పుడు ప్రమాణస్వీకారం అనుకుంటున్నారని గవర్నర్ ప్రశ్నించినట్టు చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ స్వస్థలమైన ఖాట్కర్ కళన్‌లో ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుందని మాన్ తెలిపారు. ప్రమాణస్వీకారానికి పంజాబ్ ప్రజలంతా ఆహ్వానితులేనని, వారు సైతం భగత్ సింగ్‌కు నివాళులర్పించ వచ్చని చెప్పారు. ”మంచి మంత్రివర్గం ఉంటుంది. చారిత్రక నిర్ణయాలు ఉంటాయి. గతంలో ఎవరూ తీసుకోని నిర్ణయాలు తీసుకుంటాం. వేచిచూడండి” అని ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

కేబినెట్‌లో ఎవరెవరు?కొత్త క్యాబినెట్‌లో పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో హర్పాల్ సింగ్ చీమా, అమన్ అరోరా, బల్జిందర్ కౌర్, సరవ్‌జిత్ కౌర్ మనుకె, గుర్మీత్ సింగ్ మీత్ హయెర్, బుధ్ రామ్, కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్, జీవన్‌జ్యోత్ కౌర్, డాక్టర్ చరణ్ జిత్ సింగ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మాన్ శుక్రవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలుసుకుని ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ఆయనను కోరారు. ఆదివారంనాడు మాన్, కేజ్రీవాల్ కలిసి స్వర్ణాలయంలో పూజలు నిర్వహిస్తారనీ, పార్టీ విజయోత్సవాన్ని ప్రజలతో పంచుకునేందుకు అమృత్‌సర్‌లో రోడ్‌షో‌లో పాల్గొంటారని ఆప్ ఒక ప్రకటనలో తెలిపింది.