వెంకటకృష్ణమాచార్యులకు జీవన సాఫల్య జాతీయ పురస్కారం ప్రదానం2022
రాయల్ పోస్ట్ ప్రతినిధి, సూర్యాపేట,06/03/2022
పుడమి సాహితీ వేదిక మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాదులో పుడమి జాతీయ పురస్కారాలు 2022 ప్రదానోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పుడమి సాహితీ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన విశిష్ట జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజి కేంద్రమంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వసలహాదారులు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, విశిష్ట అతిథిగా అదనపు కలెక్టర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమి మాజి కార్యదర్శి డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, సభాధ్యక్షులుగా పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చిలుముల బాల్ రెడ్డి పాల్గొన్నారు. పుడమి జాతీయ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమంలో సూర్యాపేట వాస్తవ్యులు, ప్రముఖ సాహితీవేత్త, తెలుగు ఉపన్యాసకులు తూపురాణి వేంకటకృష్ణమాచార్యులుకు జీవన సాఫల్య జాతీయ పురస్కారం 2022 ప్రదానం చేస్తూ పట్టుశాలువ, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి మాట్లాడుతూ ఆధ్యాత్మిక, సామాజిక, ధార్మిక, సాహిత్యరంగాలలో తూపురాణి వేంకటకృష్ణమాచార్యులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ప్రవృత్తిరీత్యా కలంతో అక్షరసేద్యం చేస్తూ, ఇటువైపు సామాజాన్ని, అటువైపు ప్రజలను జాగృతం చేసేట్లుగా విశేషంగా సేవలందిస్తున్నారని ప్రశంసించారు. గత వైభవ, ప్రాభవాలకు నిగూఢక్షేత్రాలుగా భాసిల్లుతున్న అనేకానేక ప్రాచీన ఆలయాల జీర్ణోద్ధరణకు వ్యాసాలు వ్రాస్తూ అవిరళంగా కృషిచేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తూపురాణి వేంకటకృష్ణమాచార్యులు మాట్లాడుతూ గత రెండున్నర దశాబ్దాలుగా ఆధ్యాత్మిక, సాహిత్య, సాంస్కృతికరంగాలపై కలాన్ని ఝులిపిస్తూ రచనలు చేస్తూ సమాజాభ్యున్నతికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. తన కృషిని మెచ్చి పుడమి సాహితీ వేదిక జీవన సాఫల్య జాతీయ పురస్కారం 2022 ప్రదానం చేయడం సంతోషాన్ని అందించడంతో పాటు బాధ్యతను పెంచిందని తెలిపారు. ఇంకా చక్కని రచనలు చేయడానికి ప్రేరణను కలిగించిందని హర్షాన్ని వ్యక్తంచేశారు. కార్యక్రమంలో పుడమి సాహితీ వేదిక జాతీయ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ముదిగంటి సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మహమ్మద్ రహీం పాష, జాతీయ కవి ప్రొద్దుటూరు యల్లారెడ్డి, వెల్లింగ్టన్ సైనికాధికారి తమిళనాడు డా. పెరుక రాజు, మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ పాలడుగు సరోజినిదేవి, సాహితీవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు, సంఘసేవకులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.