వాతావరణంలో వస్తున్న మార్పులు, నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఆహార ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపున్నట్లు ఐపీసీసీ (ది ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్‌ఛేంజ్) 6వ వార్షిక నివేదిక పేర్కొంది. ఉష్ణోగ్రతలు 1 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగితే భారత్‌లో వరి దిగుబడి 10 నుంచి 30% మేర, మొక్కజొన్న దిగుబడి 25 నుంచి 70% మేర పడిపోయే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది. పర్యావరణ పరమైన ముప్పు ప్రభావం ఆసియాలో వ్యవసాయం, ఆహార వ్యవస్థపై నానాటికీ పెరుగుతూ పోతోందని, ఇది ఖండం మొత్తం విభిన్నమైన పరిణామాలకు కారణమవుతోందని తెలిపింది. ఫలితంగా చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తుల ఉత్పత్తి, పంటల దిగుబడి తగ్గనున్నట్లు హెచ్చరించింది. ఈ ప్రభావం ఆగ్నేయాసియాలో అధికంగా ఉంటుందని పేర్కొంది. ఉద్ఘారాల ప్రభావం అత్యధికమవుతున్న కారణంగా కాంబోడియాలో 2080 నాటికి వరి ఉత్పత్తి 45% మేర తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఆసియాలో అత్యధికంగా వరి పండించే చైనా, భారత్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, వియత్నాం, థాయిలాండ్, మయన్మార్, ఫిలిప్పీన్స్, జపాన్లన్నింటికీ ముప్పు పొంచి ఉన్నట్లు హెచ్చరించింది. పెరిగిపోయే ఉష్ణోగ్రతలు, వానాకాల సీజన్లో కనిపించే విపరీతమైన మార్పులు, వడగాల్పులు, కరవులు, టైఫూన్ల వంటి వైపరీత్యాలు ఆసియా మొత్తం వ్యవసాయ ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. 21వ శతాబ్దం ముగిసేనాటికి మధ్య, పశ్చిమ ఆసియా ప్రాంతంలో 70% హిమనీనదాలు కరిగిపోతాయని చెప్పింది.
దక్షిణాసియా ప్రాంతంలో గత 40 ఏళ్లలో వ్యవసాయ అవసరాల కోసం భూగర్భ జలాలపై ఆధారపడటం విపరీతంగా పెరిగిపోయిందని ఐపీసీసీ నివేదిక తెలిపింది. ప్రపంచంలో ఉపయోగించే భూగర్భ జలాల్లో 50% భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, చైనాల్లోనే జరుగుతున్నట్లు పేర్కొంది. బిహార్‌లోని షాపుర్, మనేర్ జిల్లాల్లో 388 కుటుంబాలు తాగునీటి కోసం ఉపయోగించే భూగర్భ జలాలను పరిశీలించినప్పుడు అందులో 70 నుంచి 90% వరకు ఆర్సెనిక్ లేదా ఐరన్ లేదంటే రెండూ కనిపించినట్లు తెలిపింది. దక్షిణాసియాలో బంగ్లాదేశ్‌లోని ఖుల్నా, భారత్‌లోని గురుగ్రామ్, హైదరాబాద్, నేపాల్‌లోని కాఠ్మాండూ నగర శివార్లలో నీటి వినియోగం పెరిగినందున అక్కడ నాణ్యత తగ్గిపోతున్నట్లు పేర్కొంది. దీనివల్ల శివారు ప్రాంతాల్లో నీటి అభద్రత ఏర్పడి, ఘర్షణ వాతావరణం తలెత్తుతోందని తెలిపింది. సమాజంలోని అట్టడుగు వర్గాలకు నీటిని అందించడం ఇక్కడ సవాల్‌తో కూడిన అంశంగా మారినట్లు పేర్కొంది. మరోవైపు ఆసియా ఖండం మొత్తం సముద్రమట్టాలు పెరిగి వరదలు ఎక్కువవుతున్నట్లు తెలిపింది. చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, వియత్నాంలు ఎక్కువగా వరదల ప్రభావానికి లోనవుతున్నట్లు పేర్కొంది. సామాజిక భద్రత, మౌలిక వసతులు, సేవలు అందుబాటులో లేనిచోట ప్రకృతి వైపరీత్యాల ముప్పు ప్రభావం రెట్టింపవుతుందని హెచ్చరించింది. ఇలాంటి వాటినుంచి పేదలను రక్షించాలంటే సామాజిక భద్రత కల్పించాలని, ఇందుకోసం నగదు బదిలీతో పాటు, రాయితీలు అందించడం, ప్రభుత్వం పనులు కల్పించడం చేయాలని సూచించింది. సామాజిక, ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాలని, నిరుద్యోగ భృతి కూడా కల్పించాలని సూచించింది.
