5 లక్షల చలానాలు చెల్లించేశారు!
చలాన్ల రాయితీకి విశేష స్పందనరద్దీ కారణంగా వెబ్సైట్లో స్వల్ప సమస్యలునెలాఖరు వరకూ సమయం ఉంది: ట్రాఫిక్ విభాగం
హైదరాబాద్: ట్రాఫిక్ అధికారులు చలానాలకు రాయితీ ప్రకటించడంతో జనాలు తమ పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు క్యూ కట్టారు. దీంతో ఖజానాకు ఒక్కరోజులోనే రూ. 5.5 కోట్ల మేర కాసుల వర్షం కురిసింది. రాయితీ ప్రకటించిన తొలిరోజు విశేష స్పందన లభించిందని, రాత్రి వరకు 5లక్షలకు పైగా చలానాలను వాహనదారులు చెల్లించారని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. నిముషానికి వెయ్యికి పైగా చలానాల చెల్లింపులు నడిచాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ విభాగ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో చలానాల చెల్లింపులు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ్డబైకులకు 75 శాతం, కార్లు, లారీలకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, తోపుడు బళ్లకు 80 శాతం రాయితీని పోలీసులు కల్పించారు.
నెలాఖరు వరకూ సమయం ఉన్నా..
చలానాలపై రాయితీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే వాహనదారులు ఆన్లైన్లో చెల్లించడానికి క్యూ కట్టారు. ఫోన్ నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్, జీపే, ఫోన్‌పే లాంటి గేట్‌వేల ద్వారా, ఆన్లైన్ చెల్లింపులు అర్థం కాని వారు మీసేవా, టీసేవా కేంద్రాల ద్వారా చెల్లింపులు జరిపారు. వెబ్సైట్లో వాహనాలపై ఉన్న చలానాలు చూపించే కాలమ్ పక్కనే రాయితీ తర్వాత చెల్లించాల్సిన రుసుము కూడా కనిపిస్తోంది. దీంతో వాహనదారులు సునాయాసంగా తమ వాహనానికి చెల్లించాల్సిన చలానాలను పూర్తి చేశారు. ఈ నెల 31 వరకూ అవకాశమున్నా.. సోమవారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాతి నుంచే వాహనదారులు చెల్లింపులకు సిద్ధమయ్యారు. అయితే.. సాంకేతిక కారణాల రీత్యా.. సర్వర్ రాత్రి 2 గంటల తర్వాతే పని ప్రారంభించింది. ఈక్రమంలో మంగళవారం రాత్రి వరకు 5లక్షలకు పైగా చలానాలు క్లియర్ అయ్యాయి. చెల్లింపులు పూర్తైన మొత్తం చలానాల విలువ రూ. 20 కోట్లుగా ఉండగా.. రాయితీ అనంతరం ప్రభుత్వ ఖజానాలో రూ. 5.5 కోట్లు జమ అయ్యాయి. ‘‘సర్వర్ మొరాయించకుండా ఉండేందుకే వాహన నంబర్‌తో పాటు ఇంజన్ ఛాసిస్ నంబర్ నమోదు తప్పనిసరి చేశాం. వెబ్సైట్ స్పీడ్‌ను 10 రెట్లు పెంచాం. ఒకేసారి 60 వేల మంది చూసినా.. ఇబ్బంది తలెత్తకుండా అభివృద్ధి చేశాం. అయినా వెబ్‌సైట్‌కు రద్దీ ఎక్కువగానే ఉంది.
రెండు, మూడు రోజులు పాటు ఇలానే కొనసాగుతుంది. ఈ నెల 31 వరకు పెండింగ్ చలానాల రాయితీకి అవకాశం ఉంది. వాహనదారులు నెమ్మదిగా చలానాలు చెల్లించుకోవచ్చు.’’ అని ఉన్నతాధికారులు తెలిపారు. వెబ్సైట్ చాలా నెమ్మదిగా ఉందన్న ఫిర్యాదులు వెల్లువెత్తడంతో, వాహనదారుల సందేహాలకు అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యలను పరిష్కరించారు. మంగళవారం చెల్లించిన చలాన్లలో 80శాతం మూడు కమిషనరేట్ల పరిధిలోనివేనని జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఇక.. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలుకు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. చలానాలు అధికంగా ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిఽధిలోని ట్రాఫిక్ పోలీ్సస్టేషన్ల వారీగా చెక్ పాయింట్లను ఏర్పాటు చేయాలని డీజీపీ కార్యాలయం ఆదేశించింది. కరోనా కారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు రెండేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, వారికి ఊరట కల్పించేందుకు పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీకి అవకాశం ఇచ్చినట్లు మంత్రి మహమూద్ అలీ తెలిపారు. చలానాలను ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలని ఆయన పేర్కొన్నారు.