ఇబ్రహీంపట్నంలో కాల్పుల కలకలం..రియాల్టర్ మృతి

రంగారెడ్డి: జిల్లాలోని ఇబ్రహీంపట్నం పరిధిలోని కర్ణంగూడ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. స్కార్పియో కారులో వెళ్తున్న ఇద్దరు రియాల్టర్‌లపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
కాల్పుల్లో రియాల్టర్ నవార్ శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, కోమటిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.

రాఘవేందర్ రెడ్డి ఛాతీ కింద బుల్లెట్ దూసుకెళ్లడంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడికి బీఎన్ రెడ్డిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
అయితే శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి కలిసి ఇబ్రహీంపట్నం పరిధిలోని లేక్ వ్యూస్‌కు సమీపంలో వెంచర్ వేసినట్లు వారి సన్నిహితులు తెలిపారు.

ఈ ఉదయం ఆ వెంచర్‌లో బోర్ వేయించేందుకు వీరిద్దరూ వెళ్లినట్లు చెప్పారు. ఆ సమయంలోనే శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు వారి సన్నిహితులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.