హైదరబాద్ :రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. మొదట్నుంచి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం తన నైజమని చెప్పారు. రాజకీయాల్లో పోటీలు, పదవులు ఆశించడం సహజమన్నారు. ఏదైనా కోపమున్నా నేరుగా చెప్పడం తన వ్యక్తిత్వమని స్పష్టం చేశారు. తాను కరెక్టుగా ఉండి, మిగతా వాళ్లు అలాగే ఉండాలని ఆశిస్తానని పేర్కొన్నారు. తాను ఎవరికి భయపడేది లేదని మీడియా సమావేశంలో జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

నిర్మోహమాటంగా మాట్లాడతాననే…

మీడియా దృష్టిలో పడేందుకే మాట్లాడతాననటం సరికాదని జగ్గారెడ్డి తెలిపారు. నిర్మోహమాటంగా మాట్లాడతాననే తన మీద మీడియా దృష్టి ఉంటుందని చెప్పారు. తనవల్ల పార్టీకి నష్టం జరుగుతుందనే ప్రచారం కొందరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూట్యూబ్​ ఛానల్లలో తన మీద కోవర్టు అనే ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోందని అన్నా్రు. నాపై బురద చల్లుతున్నారు కాబట్టే పార్టీ వీడాలని భావించినట్లు పేర్కొన్నారు.

బయటకు వెళ్లాలనే నిర్ణయించుకున్నా…

‘ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌లోనే ఉండాలని అనుకున్నా. నేను కాంగ్రెస్‌లో ఉంటే కొందరు ఇబ్బందిగా భావిస్తున్నారు. కాంగ్రెస్‌ బాగుండాలనే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యా. కాంగ్రెస్‌ నుంచి బయటకెళ్లినా… వేరే పార్టీలో చేరను. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కొందరు చెప్పారు. ఆలోచించి నాలుగైదు రోజుల్లో నా నిర్ణయం ప్రకటిస్తా. కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్లాలనే నిర్ణయించుకున్నా. పార్టీ పదవికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తా.’- జగ్గారెడ్డి

తాను పార్టీని వీడినా… కాంగ్రెస్‌కు వచ్చే నష్టం ఏమీ లేదని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ను వీడినా… స్వతంత్రుడిగానే రాజకీయాల్లో ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ నుంచి బయటకు వెళ్తే కొత్త పార్టీ పెడుతానని అన్నారు.