రాజ‌న్న సిరిసిల్ల : భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. 2014లో మోదీని ఈ దేశ ప్ర‌జ‌లు న‌మ్మ‌డ‌మే అతిపెద్ద త‌ప్పు అని కేటీఆర్ పేర్కొన్నారు. న‌మో అంటే న‌రేంద్ర మోదీ కాదు.. న‌మో అంటే న‌మ్మించి మోసం చేసేటోడు అని కేటీఆర్ విమ‌ర్శించారు. జీవితాలు మార్చు అని అధికారం అప్ప‌గిస్తే.. ఉన్న జీవిత బీమా సంస్థ‌ను కూడా అమ్మేస్తుండు. నినాదాలు అద్భుతంగా ఉంటాయి.. కానీ ప‌ని మాత్రం లేదు అని మోదీ పాల‌నను కేటీఆర్ ఎండ‌గ‌ట్టారు.

రాజ‌న్న సిరిసిల్ల‌లోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షులుగా తోట ఆగ‌య్య ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజ‌రై ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్ర బిల్లు స‌రిగ్గా ఇదే రోజు 8 ఏండ్ల క్రితం పార్ల‌మెంట్‌లో పాస్ అయింది. ఈ శుభ‌దినంన తోట ఆగ‌య్య ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌యం అని కేటీఆర్ కొనియాడారు.

తెలంగాణ భార‌త‌దేశానికే దిక్సూచి..
మీ తెలంగాణ లీడ‌ర్ల‌కు తెలివిందా? నాయ‌క‌త్వ స‌త్తా ఉందా? మీకు ప‌రిపాలించే సీన్ ఉందా? అని స‌మైక్య‌వాదులు ప‌లు ర‌కాలుగా అడ్డ‌గోలు వాద‌న‌లు చేశారు. విద్యుత్ స‌మ‌స్య ఏర్ప‌డుత‌ద‌ని ఓ సీఎం అన్నారు. కొత్త కొలువులు, కొత్త పెట్టుబ‌డులే కాదు.. ఉన్న కొలువులు, పెట్టుబ‌డులు వెన‌క్కిపోతాయ‌ని మ‌రొక‌రు అన్నారు. ఇష్ట‌మొచ్చిన మాట‌లు మాట్లాడారు. కానీ ఇవాళ 8 ఏండ్ల త‌ర్వాత తెలంగాణ మోడ‌ల్ భార‌త‌దేశానికే దిక్సూచిగా మారింది. మ‌న ప‌థ‌కాల‌ను చాలా రాష్ట్రాలు అనుస‌రిస్తున్నాయి. ఇది కేసీఆర్ ప‌రిపాల‌న‌కు నిద‌ర్శ‌నం. ఇవాళ మ‌న అభివృద్ధిని చూసి భార‌త‌దేశ‌మే అబ్బుర‌ప‌డుతోంది. ఇవాళ తెలంగాణ చేసిన ప‌నిని, రేపు భార‌త‌దేశం అమ‌లు చేస్తోంద‌నే స్థాయికి ఎదిగామ‌న్నారు. 60 ఏండ్ల‌లో కాని ప‌నులు ఆరేడు ఏండ్ల‌లోనే అయ్యాయి. ఇది కేసీఆర్ వ‌ల్లే సాధ్య‌మైంద‌న్నారు.

అది కూడా తెలువ‌నోడు మ‌న ప్ర‌ధాని కావ‌డం దౌర్భాగ్యం..
8 ఏండ్ల కింద ఇవాళ భార‌త ప్ర‌ధానిగా ఉన్న న‌రేంద్ర మోదీ ఏపీలో ప్ర‌చారం చేసి అడ్డంగా మాట్లాడిండు. ఏపీ విభ‌జ‌న చాలా దారుణంగా చేశారు. త‌ల్లిని చంపి బిడ్డ‌ను వేరు చేశార‌ని మోదీ మాట్లాడారు. ఓట్ల కోసం మాట్లాడిండు అనుకున్నాం. ఆ రోజు కూడా లొల్లి పెట్టాం.. కానీ తెల‌వ‌ని త‌నం అనుకున్నాం. నిన్న కాక మొన్న అసంద‌ర్భంగా పార్ల‌మెంట్‌లో మాట్లాడుతూ.. త‌లుపులు మూసి అన్యాయంగా విభ‌జ‌న చేశార‌ని అడ్డ‌గోలుగా మాట్లాడిండు. బిల్లు ఓటింగ్‌కు వ‌స్తే ప‌క్కా ద‌ర్వాజాలు బంద్ చేసే పాస్ చేస్తారు. ఇది కూడా తెలువ‌నోడు మ‌న ప్ర‌ధాని కావ‌డం దౌర్భాగ్యం. ప్ర‌గ‌తిప‌థంలో దూసుకుపోతున్న తెలంగాణ‌కు సాయం చేయ‌కుండా, ఈ రాష్ట్ర పుట్టుకనే ప్ర‌శ్నిస్తున్నాడు. తెలంగాణ పుట్టుక‌నే ప్ర‌శ్నిస్తున్న బీజేపీకి ఇక్క‌డ పుట్ట‌గ‌తులు ఉండాల్నా ఆలోచించుకోవాలి. మిష‌న్ భ‌గీర‌థ‌ను సిగ్గులేకుండా కాపీ కొట్టి మ‌న‌కు నిధులు ఇవ్వ‌డు అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

మోదీ మోసం చేశాడు..
బీహార్‌లో ఓ వ్య‌క్తి అకౌంట్లో రూ. 10 ల‌క్ష‌లు జ‌మ అయ్యాయి. మోదీ పంపిండు అని ఆ పైస‌ల‌తో ఇల్లు క‌ట్టుకుండు. మోదీ పంపలేదు. అదంతా అబ‌ద్దం.. పైస‌లు క‌ట్టు అని బ్యాంకు అధికారి నిల‌దీస్తే ఆ వ్య‌క్తి దీక్ష చేసిండు. జ‌న్ ధ‌న్ ఖాతాలో రూ. 15 ల‌క్ష‌లు వేస్తాన‌ని మోదీ మాట మరిచారు. 2 కోట్ల ఉద్యోగాలు ప్ర‌తి సంవ‌త్స‌రం ఇస్తాన‌ని చెప్పి మోసం చేశారు. ఉద్యోగాల గురించి మీడియా ప్ర‌శ్నిస్తే.. మోదీ తెలివిగా స‌మాధానం చెప్పాడు. మీ సిరిసిల్ల హాస్పిట‌ల్ ముంద‌ట ప‌కోడి వేసుకోవ‌డం ఉద్యోగం క‌దా? అని మోదీ అంటున్నాడ‌ని కేటీఆర్ మండిప‌డ్డారు.