జనగామ : పోలీసుల అనుమతి లేకుండా ఇకనుంచి ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు, దీక్షలు వంటి కార్యక్రమాలు చేపడితే నాన్ బెయిలబుల్ కేసులు విధించడం జరుగుతుందని వెస్ట్ జోన్ జనగామ డీసీపీ పి.సీతారాం తెలియజేశారు. సోమవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. జిల్లాలో పోలీసుల అనుమతి లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ధర్నాలు, నిరసనలు చేపట్టడంతో బందోబస్తుకు ఆటంకాలు కలుగుతున్నాయని, ఇకపై అనుమతి లేకుండా ఎవరైనా నిరసనలు, ర్యాలీలు వంటివి చేపడితే సెక్షన్ 151 కేసులు వేసేవాళ్లం.. కానీ ఇక నుంచి డైరెక్ట్ గా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జరుగుతుందన్నారు.
అలాగే నిరసనలు, ధర్నాలు చేపట్టేందుకు కళాశాల నుండి విద్యార్థులను తీసుకువచ్చిన నాయకులతో పాటు కళాశాలల పై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రిన్సిపాల్ పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జరుగుతుందని డీసీపీ వివరించారు. అనుమతి లేని ధర్నాలు, రాస్తారోకోలు టెంట్లు, మైకులు కూడా ఇవ్వకూడదని సంబంధిత నిర్వాహకులకు సూచించారు. అనుమతి లేకుండా టెంట్లు, మైకులు ఇస్తే వాటిని సైతం సీజ్ చేస్తామని హెచ్చరించారు.  ప్రజాస్వామ్యబద్దంగా ప్రతి ఒక్కరూ నిరసనలు, ధర్నాలు చేసేందుకు అవకాశం ఉందని.. అందుకు అనుగుణంగా ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. మూడు నాన్ బెయిలబుల్ కేసులు దాటితే రౌడీ షీటర్ ఓపెన్ చేసి పి డి యాక్ట్ కేసులు సైతం పెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జనగామ ఏసీపీ కృష్ణ, జనగామ టౌన్ సీఐ బాలాజీ వరప్రసాద్ ఉన్నారు.