రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన వల్ల జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కేవలం దేశ ప్రధాని మోదీని అసభ్య పదజాలంతో దూషించాడనికే ముఖ్యమంత్రి శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలో సభ ఏర్పాటు చేయడం జరిగిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, జేడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ డాక్టర్ కుడుదుల నగేష్, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డిలు విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రహదారి బంగ్లాలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటిసారిగా తమ జిల్లాకు వస్తుండడంతో జిల్లా సమస్యలు త్వరితంగా పరిష్కారమవుతాయని ప్రజలు పెట్టుకున్న ఆశలు నిరాశగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందన్న ముఖ్యమంత్రియాదాద్రి జిల్లా వ్యాప్తంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. సమస్యలు చెప్పుకోవడానికి ప్రగతి భవన్ లో ప్రజలకు సమయమివ్వని ముఖ్యమంత్రికి జిల్లా పర్యటనలోనైనా చెప్పుకుందామనుకుంటే పోలీసులచేత ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయించడం ముఖ్యమంత్రికి తగదన్నారు. నువ్వు ప్రజా సేవ చేయడానికి ముఖ్యమంత్రి అయ్యావు అనే విషయాన్ని విస్మరించి ఒక నియంత లాగా వ్యవహరిస్తున్నావని వారు ఆరోపించారు. బహిరంగ సభలో కనీసం తన పార్టీకి చెందిన జిల్లా ఎమ్మెల్యేలను మాట్లాడనివ్వకుండ అవమానపరచడం, నీ అహంకారాన్ని తెలియజేస్తుందన్నారు. పవిత్రమైన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని సైతం వదలకుండా రాజకీయవేదికగా వాడుకోవడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి పై పెరుగుతున్న ప్రజావ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లుతుండంతో భయపడ్డా కెసిఆర్, జిల్లాల పర్యటనలు చేస్తూ మాయమాటలతో మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని వారు ఆరోపించారు. తన రాజకీయ పబ్బం కోసమే కెసిఆర్ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాడని వారు విమర్శించారు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్షాల మాటలను గౌరవించడం జరుగుతుందన్నారు. కానీ ప్రస్తుతం కేసీఆర్ కు ప్రతిపక్షాలు అంటే ఏ మాత్రం గౌరవం లేదని అందుకే తన పర్యటనల సందర్భంగా ప్రతిపక్ష నాయకులను ముందస్తుగా బలవంతంగా అరెస్టులు చేయిస్తున్నాడని వారుఆరోపించారు. ముఖ్యమంత్రి బహిరంగసభలో ఆలేరు రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తారని ఆశించిన ఎమ్మెల్యే గొంగిడి సునీతకు నిరాశే మిగిలిందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన నియంతృత్వ వైఖరిని మార్చుకుని యాదాద్రి భువనగిరి జిల్లా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని లేనిచో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, కౌన్సిలర్లు ఈరపాక నరసింహ, కైరంకొండ వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు ఎండి సలావుద్దీన్, కొల్లూరి రాజు తదితరులు పాల్గొన్నారు.