150 మంది ప్రచురణకర్తలు, ఎడిటర్ల చేరిక ఇక టీయుడబ్ల్యుజెకు అనుబంధంగా కార్యకలాపాలు

రాయల్ పోస్ట్ ప్రతినిధి హైదరాబాద్ డిసెంబర్ / గత కొంతకాలంగా
143 సంఘానికి అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ చిన్న, మధ్యతరగతి పత్రికలు మరియు మేగజైన్స్ అసోసియేషన్ ఆ సంఘానికి గుడ్ బై చెప్పి తెలంగాణ రాష్ట్రంలో వేలాది జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయుడబ్ల్యుజె లో చేరింది. సోమాజిగుడ ప్రెస్ క్లబ్ లో ఇవ్వాళ జరిగిన తెలంగాణ చిన్న, మధ్యతరగతి పత్రికలు మరియు మేగజైన్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని చిన్న, మధ్యతరగతి పత్రికలు నిర్వహిస్తున్న దాదాపు 150మంది ప్రచురణకర్తలు, సంపాదకులు ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీల సమక్షంలో టీయుడబ్ల్యుజె లో చేరారు. దాదాపు అరవై ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీయుడబ్ల్యూజే, రాష్ట్ర విభజన తర్వాత 8 ఏండ్లుగా తెలంగాణ రాష్ట్రంలో టీయుడబ్ల్యుజె సంఘం జర్నలిస్టుల హక్కుల సాధనకై రాజీలేని పోరాటాలు చేస్తున్నందువల్లే తాము ఆకర్షితులై టీయుడబ్ల్యుజెకు అనుబంధంగా పనిచేసేందుకు నిర్ణయించుకున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసుఫ్ బాబు, బాలకృష్ణలు స్పష్టం చేశారు. తెలంగాణ విభజనకు ముందు తాము ఆనాటి ఏపీయుడబ్ల్యూజే సంఘంలోనే కొనసాగామని, రాష్ట్ర విభజన తర్వాత
అల్లం నారాయణ గారి నేతృత్వంలో ఆవిర్భవించిన సంఘంలో తాము చేరగా జర్నలిస్టుల లక్ష్యానికి అనుగుణంగా ఆ సంఘం పనిచేయడం లేదని వారు ఆరోపించారు. మరోవైపు రాజీలేని పోరాటాలతోనే హక్కులు సాధించుకోవచ్చనే నిజాన్ని టీయుడబ్ల్యుజె-ఐజేయూ సంఘం నిరూపిస్తున్నందు వల్లే తాము టీయుడబ్ల్యుజెలో చేరి, దానికి అనుబంధంగా పనిచేయదలచుకున్నట్లు వారు స్పష్టం చేశారు. తమ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆమోదించిన తీర్మాణాన్ని ఐజేయూ, టీయుడబ్ల్యుజె నాయకులకు అందించారు. 
ఇంకా ఈ కార్యక్రమంలో చిన్న మధ్యతరగతి పత్రికల అసోసియేషన్ నాయకులు దయానంద్, షరీఫ్,అల్వాల్ హన్మంతు, అక్తర్ హుస్సేన్, వెంకటయ్య, ఖాసీం, రాజిరెడ్డి, మాధవరెడ్డి, అజంఖాన్, రామకృష్ణ,మొహమ్మద్ ఖాజా ఫసీఉద్దీన్, పృథ్వీరాజ్, రామారావు,సాయిరాం,
అమన్, టీయుడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, హెచ్.యు.జె కార్యదర్శి శిగా శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నాటి నుండి పోరాడుతున్నాం
-కే.ఎస్.ఆర్
చిన్న, మధ్యతరగతి, మేగజైన్లకు న్యాయం చేకూర్చేందుకు తమ సంఘం నాటి నుండి నేటి వరకు పోరాడుతుందని ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పదవుల కోసం, ఇతర ప్రయోజనాల కోసం సంఘాలు పెట్టి ట్రేడ్ యూనియన్ స్వభావాన్ని దెబ్బతీసే వారిని క్షమించారదని ఆయన పిలుపునిచ్చారు. తమకు ఏ ప్రభుత్వం వ్యతిరేకం కాదని, ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వాలతో తాము యుద్ధం చేయమని, అయితే ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా ఉన్న మీడియా స్వేచ్చకు భంగం కలిగిస్తే, జర్నలిస్టుల హక్కులను కాలరాస్తే మాత్రం ఊరుకోబోమని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.

రాష్రంలో శుభపరిణామం విరాహత్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛ పరిరక్షణ, జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న తమ సంఘం పనితీరుపై ఆకర్షితులై తెలంగాణ చిన్న, మధ్యతరగతి పత్రికలు, మేగజైన్స్ సంపాదకులు, ప్రచురణకర్తలు టీయుడబ్ల్యుజెలో చేరడం శుభపరిణామమని, వారిని స్వాగతిస్తున్నట్లు టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అన్నారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం 60ఏండ్ల క్రితం పురుడుబోసుకున్న తమ సంఘం ఎల్లప్పుడు అదే స్ఫూర్తితో పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.