రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: : భారతదేశ మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ జయంతి ని అధికారికంగా నిర్వహించాలి….
భారతదేశ మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలైన ఫాతిమా షేక్ జయంతి జనవరి 9 ని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ భువనగిరి పార్లమెంట్ కో కన్వీనర్ మహమ్మద్ అతహర్ డిమాండ్ చేశారు.ఆదివారం అతహర్ విలేకర్లతో మాట్లాడుతూ మన దేశ తొలి ఉపాధ్యాయురాలిగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలేతో కలిసి బాలిక విద్యకు కృషి చేసిన మహిళ ఫాతిమా షేక్ అని ఆమెను ఆధునిక భారత తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలిగా చెబుతారన్నాను. సావిత్రిబాయి పూలే తో కలిసి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని ఇద్దరూ జన్మించింది జనవరి లొనే అని జనవరి 3 సావిత్రిబాయి పూలే జయంతి, జనవరి 9 ఫాతిమా షేక్ పుట్టిన రోజు అని తెలుయచేశారు . పూలే దంపతులు బాలికా విద్యకు కృషి చేస్తుండగా, దాన్ని సమాజం అంగీకరించలేదు. వారిని ఇంటి నుంచి పంపించేయాలని ఫూలే తండ్రి గోవింద్ రావుపై ఒత్తిడి పెరగడంతో ఫూలే దంపతులను బయటికి పంపించేశారు. ఆ సమయంలో వారికి ఉస్మాన్ షేక్, ఆయన సోదరి ఫాతిమా ఆశ్రయం కల్పించారు. అంతేకాకుండా 1848లో పూణే నగరంలోని ఉస్మాన్‌ షేక్‌ నివాసంలో పాఠశాలను నెలకొల్పారు. సావిత్రి బాయి పూలే కలను సాకారం చేసేందుకు నాడు ఉస్మాన్ షేక్ నివాసమే ఓ బడిగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పూణె పరిసర ప్రాంతాల్లో పలు పాఠశాలలను, వసతి గృహాలను ప్రారంభించారు. సావిత్రి బాయితో కలిసి బలహీనవర్గాల విద్య కోసం సాగిన అక్షర ఉద్యమంలో ఫాతిమా షేక్ భాగస్వాములయ్యారు. ఆ సమయంలో ముస్లిం కుటుంబాల్లో కూడా నిరక్షరాస్యత ఎక్కువగా ఉండేది. సమాజంలో సాంఘిక సమానత్వ సాధన, స్త్రీ విద్యా వ్యాప్తి కోసం సావిత్రిభాయి ఫూలే చేస్తున్న కార్యక్రమాల్లో ఫాతిమా షేక్‌ కీలకపాత్ర పోషించారు. 1856 లో సావిత్రి బాయి అనారోగ్యం కారణంగా చాలా రోజులు పుట్టింట్లోనే గడిపారు. ఆ సమయంలో పాఠశాలలు నిర్వహణ బాధ్యతలను ఫాతిమానే చూసుకున్నారు . అందువలన ఫాతిమా షేక్ జయంతిని జనవరి 9వ తేదీన అధికారికంగా నిర్వహించాలని తెలిపారు..