రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ భువనగిరి రురల్ / భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని రైతు వేదిక భవనంలో రైతుబంధు వారోత్సవ సంబురాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పెట్టుబడి పథకం ప్రపంచానికే ఒక మార్గదర్శిగా మారిందని అన్నారు. ఈనెల 4 నుండి 10వ తేదీ వరకు జరుగుతున్న రైతుబంధు వారోత్సవ సంబరాలలో రైతులు పెద్దఎత్తున ఉత్సాహంగా పాల్గొంటున్నారని అన్నారు.ఎలాంటి షరతులు లేకుండా 2018 ఆగస్టు నుండి రైతు క్షేమం కోసం, రైతు ఆర్థిక బలోపేతానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు, ఒక కోటి 45 లక్షల ఎకరాలకు రైతుబంధు పెట్టుబడి అందించడం జరుగుతున్నదని అన్నారు. 92 శాతం ఉన్న ఐదు ఎకరాల లోపు సన్న చిన్నకారు రైతులకు భరోసాగా రైతుబంధు నిలిచిందని అన్నారు. రైతు బంధు పథకం కింద 50 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలోకి నేరుగా జమ చేయడం జరిగిందని, ఒక గుంట భూమి ఉన్న రైతుకు కూడా పెట్టుబడి అందిస్తున్నామని అన్నారు. ప్రపంచంలో వ్యవసాయ విస్తీర్ణంలో రెండవ స్థానంలో ఉన్న భారతదేశంలో వ్యవసాయం ఒక జీవన విధానం, నాగరికతకు చిహ్నమని అన్నారు. దేశంలో గత 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఆరుగాలం కష్టపడే రైతుకు నేరుగా పెట్టుబడి ఇచ్చిన మహానుభావుడు, రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఏ పథకమైనా సరే ఆయన దార్శనికత నుంచి ఉద్భవించినవేనని, అలాంటి సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గత నాలుగేళ్ల నుండి ఎనిమిది సీజన్లలో రైతాంగానికి 1968 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షల మోటార్ బావులు ఉన్నాయని, ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 10 వేల కోట్లు కరెంట్ సబ్సిడీ కింద కడుతున్నదని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రతి సంవత్సరం సగటున 25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం వివిధ పథకాల కింద సంవత్సరానికి 60 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. రాష్ట్రం కంటే ఐదు రెట్లు పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ లో రైతులు ఆయిల్ ఇంజన్ మోటార్ల మీదే ఆధారపడ్డారని, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని, ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలో కూడా లేదని అన్నారు. ఒకనాడు తెలంగాణ కరువు కాటకాలలో మగ్గిందని, కాని ఈరోజు రైతు సగర్వంగా, ఆర్థిక మనోబలంతో బతికేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు కేంద్రంగా పెద్దపీట వేసిందని అన్నారు. గతంలో గ్రామాలలో పని లేని పరిస్థితులు ఉండేవని, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అనేక పథకాలతో వ్యవసాయ రంగం అధిక దిగుబడులను సాధిస్తూ పనికి మనుషుల కొరత ఏర్పడి పక్క రాష్ట్రాల నుండి కూలీలు వస్తున్నారని అన్నారు. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా రైతులు ధాన్యపు రాశులతో ముగ్గులు వేస్తున్నారని, రైతులు వేసిన పంటలలో, రైతు జీవన విధానంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా కనిపిస్తున్నారని, రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపారని అన్నారు. రాష్ట్రంలో సంవత్సరన్నర కాలంలో మిగులు ప్రాంతాలలో మన ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తారని తెలిపారు. పత్తికి డిమాండు ఉన్నదని, క్వింటాల్ పత్తి 10,200/- ఉందని, నీరు, కరెంటు ఉచితంగా ఇస్తున్నందున రైతులు అధికంగా పత్తి వేయాలని, దానితో పాటు పెసర్లు, కందులు, ఆముదాలు, శనగలు, కూరగాయలు, తదితర ఆరుతడి పంటలు వేసుకుంటే లాభం ఉంటుందని, రాష్ట్రంలో 51 రకాల వ్యవసాయ ఉత్పత్తులో వరి ఒక పంట మాత్రమేనని, ఇది రైతాంగం గుర్తించి మిగతా పంటలు వేయాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతో ఇతర పంటలతో అద్భుతాలు సాధించాలని కోరారు. వేల ఏళ్ల నుండి వ్యవసాయం నాగరికతో ముడిపడి ఉన్నదని, అది మన జీవన విధానమని, అవగాహన లేని వారి మాటలు విని రైతులు మోసపోవద్దని, భూమిని, తన కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎన్నడూ చెడిపోడని, అలాగే మన ముఖ్యమంత్రిని, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను నమ్మిన రైతులు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు.

జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పెట్టుబడి కింద రైతుబంధు ద్వారా రాష్ట్రంలో 50 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, జిల్లాకు సంబంధించి 1968 కోట్లు రైతుబంధు పథకం కింద మంజూరు చేయడం జరిగిందని అన్నారు.

భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల మేలు కోరి 50 వేల కోట్ల రూపాయలు రైతుబంధు పథకం క్రింద వారి ఖాతాలోకి నేరుగా జమ చేయడం పట్ల రైతు లోకం సంతోషంతో రాష్ట్రం మొత్తం రైతు బంధు సంబరాలు నిర్వహించుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించి, 2014 నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, ఉచిత సాగునీరు తదితర రైతుకు లబ్ధి చేకూరే పథకాలతో రైతులు సుఖసంతోషాలతో ఉన్నారని, రైతు క్షేమం కోరే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పుడు సుఖసంతోషంతో ఉండాలని ప్రతి రైతు కోరుతున్నారని అన్నారు. రైతును రాజు చేయాలనే కేసీఆర్ సంకల్పాన్ని రైతు లోకం, మనందరం గమనించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు జె..అమరేందర్ గౌడ్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కె. అమరేందర్ గౌడ్, భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, భువనగిరి జడ్పిటిసి బీరు మలయ్య, ఎంపీపీ శ్రీమతి నరాల నిర్మల వెంకటస్వామి, భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ కిష్టయ్య, ముత్తిరెడ్డిగూడెం సర్పంచ్ ఎం.సత్యనారాయణ, ఎం పి టి సి కృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి అనురాధ, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీమతి పరిమళ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీమతి అన్నపూర్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, సహకార శాఖల అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.