రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /కోవిడ్ ను దృష్టిలో పెట్టుకొని  జాగ్రత్తలు తీసుకుంటూ జర్నలిస్టులు విధులు నిర్వర్తించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు సూచించారు. కోకాపేట్ లోని తన నివాసంలో ఆయన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూ డబ్ల్యూజే) రూపొందించిన మీడియా డైరీ-2022ని ఆవిష్కరించి మాట్లాడారు. కోవిడ్ మొదటి, రెండవ వేవ్ లలో పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. రాబోవు 45రోజుల్లో వైరస్ వ్యాప్తి మరింత ఉధృతంగా ఉండే అవకాశం ఉన్నందున విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. జర్నలిస్టులు నిత్యం ప్రజల మధ్యే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నందున గతంలో తమ ప్రభుత్వం ప్రత్యేక  క్యాంపులను నిర్వహించి వేలాది మంది జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు కోవిడ్ వాక్సిన్ ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే మళ్లీ క్యాంపులు నిర్వహిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. జర్నలిస్టులకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఆపద వచ్చినా వారికి అండగా ఉంటామని హరీష్ రావు హామీ ఇచ్చారు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ సీనియర్ నాయకులు, ఆం.ప్ర.ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, పీసీఐ మాజీ సభ్యులు ఎం.ఏ.మాజిద్, జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ఉపాధ్యక్షులు దొంతు రమేష్, కార్యదర్శి ఫైసల్ అహ్మద్, కోశాధికారి కె.మహిపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, దేశపాక స్వామి, హెచ్.యు.జె అధ్యక్షులు రియాజ్ అహ్మద్, గౌస్, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మోతె వెంకట్ రెడ్డి, జి.బాల్ రాజ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.