రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ భువనగిరి/ భువనగిరి మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, లూయిస్ బ్రెయిలీ అసాధారణ ప్రతిభను మనం స్మరించుకోవాలని, ఆరు చుక్కలతో బ్రెయిలీ లిపిని కనిపెట్టి ప్రపంచానికి, ముఖ్యంగా అంధులకు అక్షరజ్ఞానం ప్రసాదించిన మహనీయుడని, బ్రెయిలీ లిపి ద్వారా ఎందరో దివ్యాంగులు ఉన్నత స్థానాలలో వెలుగొందుతున్నారని అన్నారు. లూయిస్ బ్రెయిలీ ఎప్పుడో 18వ శతాబ్దంలో చేసిన ప్రయోగాన్ని ఈ రోజు ఇంకా మనం వాడుతున్నామని, కొత్త ఆవిష్కరణలు కూడా ఎక్కువకాలం ఉండవని, అలాంటిది డిజిటల్ యుగంలో కూడా బ్రెయిలీ లిపిని వినియోగిస్తున్నామని, అదే అతని ప్రతిభకు తార్కాణమని అన్నారు. హెలెన్ కెల్లర్ పుట్టుకతోనే చదవలేదు, చూడలేదు, వినపడదు. అయినా ఆమె బధిరులకు, అంధులకు, మూగవారికి వారధిగా చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అలాగే గొప్ప కవి, కృష్ణుని మీద ఎన్నో క్రృతులు వ్రాసిన సంత్ సురదాస్ కూడా అంధులేనని, ఇంకా ఎందరో మహానుభావులు తమ దేహంలో లోపం ఉన్నా సరే పట్టుదలతో, కృషి తో ఎన్నో విజయాలను సాధించారని, తమ తోటి వారికి మార్గదర్శకులు అయ్యారని, అవయవ లోపం ఉంటే తక్కువ అని భావించవద్దని అన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, జిల్లాలోని దివ్యాంగులకు అన్ని రకాలుగా సహాయపడే ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబరు 1800-572-8980 ఉన్నదని, ఫోన్ చేసి తమ తమ సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చునని వివరించారు.
కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి మాట్లాడుతూ, సర్. లూయిస్ బ్రెయిలీ అంధులకు చేసిన మేలు, ఆయన కనిపెట్టిన బ్రెయిలీ లిపి పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమంలో CWC చైర్మన్ జయశ్రీ , జిల్లా విద్యాశాఖ అధికారి నరసింహ్మ, జిల్లా యువజన సంక్షేమ అధికారి ధనుంజయ్ , FRO తిరుపతి రెడ్డి,DCPO సైదులు, జిల్లా అంధ దివ్యాంగుల అధ్యక్షులు నర్సింలు, దివ్యాంగులు పాల్గొన్నారు.