రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని ఖరాఖండిగా చెప్పినందున రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసే విధంగా ప్రోత్సహించవలసినదిగా శాసనమండలి సభ్యులు శేరి సుభాష్ రెడ్డి సూచించారు. మంగళవారం అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి అదనపు కలెక్టర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన సాగునీటి సలహా సంఘం సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులు, సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ యాసంగి పంటను ఎఫ్.సి.ఐ. కొనుగోలు చేయదు కాబట్టి ప్రత్యామ్నాయ పంటలైన కందులు, మినుములు, పేసర్లు, వేరుశనగ,ఆయిల్ సీడ్స్,పత్తి, నువ్వులు వంటి పంటలు వేసేలా ప్రోత్సహించాలన్నారు. ఒక వేళ రైతులు అవసరాల మేరకు, లేదా విత్తన డీలర్ల హామీ మేరకు ధాన్యం పండించుకుంటే పరవాలేదని, ప్రభుత్వం మాత్రం యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోదని స్పష్టం చేశారు. కాగా యాసంగిలో రైతుల డిమాండ్, అవసరం మేరకు సింగూరు నుండి సాగునీరు అందించుటకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నీటి పారుదల శాఖ క్రింద ఉన్న 27,675 ఎకరాల ఆయకట్టు పరిధిలోని రైతుల ఆలోచన విధానంలో మార్పు వచ్చేలా చక్కటి కార్యాచరణ, ప్రణాళికతో ముందుకెళ్లి అవగాహన కలిగించవలసినదిగా ఇంజనీరింగ్, వ్యవసాయ శాఖాధికారులకు సూచించారు. వ్యవసాయాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులు వరికి బదులు తమ పంట పొలాలలో ఏ రకమైన ఆరుతడి పంటలు వేయాలో అవగాహన కలిగించాలన్నారు. అట్టి పంటలను కాపాడుటకు ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీపై సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని అన్నారు. భూగర్భ జలాల పెంపునకు శాశ్వత ప్రాతిపదికన మంజీరా నది, హల్దీ వాగు పై నిర్మిస్తున్న చెక్ డ్యాంలు త్వరితగతిన పూర్తి చేయుటకు ఈ యాసంగి మంచి అవకాశమని, అటు ప్రభుత్వానికి నష్టం కలగకుండ, ఇటు రైతులకు ఇబ్బంది లేకుండా శ్రామికులు, మెషినరీని అధికంగా పెట్టి పనులను వేగిరపరచాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అంతకు ముందు కాళేశ్వరం కాలువ నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేయాలని ఆర్.డి.ఓ.లకు సూచించించారు
ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ సూపెరింటెండెండింగ్ ఇంజనీర్ యేసయ్య, ఈఈలు శ్రీనివాస్ రావు, కీమానాయక్,మెదక్, తూప్రాన్ ఆర్.డి.ఓ. లు సాయి రామ్, శ్యామ్ ప్రకాష్, సాగునీటి సలహా సంఘం సభ్యులు, కొంపల్లి సుభాష్ రెడ్డి, నరసింహ రెడ్డి, రామ కిషన్,డి.ఈ.ఈ.లు శివ నాగరాజు,జగన్నాధం, శ్రీధర్ , శ్రీకాంత్, ఏ.ఈ.ఈ. లు విజయకుమార్, శ్రీహరి గౌడ్, అనురాద, టింకు డి తదితరులు పాల్గొన్నారు.