హైదరాబాద్: సోషల్ మీడియా ప్లాట్‌ఫారం మీద జర్నలిస్టులే నడిపిస్తున్న వెబ్‌సైట్లు, డిజిటల్ పేపర్లు ప్రధాన స్రవంతికి తీసిపోని విధంగా ఉంటున్నాయని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. తెలుగులో బీబీసీ, దిశ లాంటివి, ఆంగ్లంలో వైర్, స్క్రోల్ లాంటివి జర్నలిస్టు విలువలతో నడుస్తున్నాయని అన్నారు. ఇలాంటి వాటికి ప్రజల నుంచి ఆదరణ, సమాజ ఆమోదం కూడా ఉంటుందన్నారు. సోషల్ మీడియా విపరీత ధోరణులపై, చౌకబారు విమర్శలతో కూడిన కథనాలపై ఆదివారం ఓ ప్రైవేటు టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఎన్నో పరిశోధనాత్మక కథనాలను అవి వెలుగులోకి తెస్తున్నాయన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో అనుభవం ఉన్న జర్నలిస్టులైనందున ఆ ఎథిక్స్, ప్రమాణాలను పాటిస్తున్నాయన్నారు. సోషల్ మీడియాకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక కంట్రోలింగ్ వ్యవస్థ లేకపోవడం, స్వీయ నియంత్రణ కొరవడడం, జర్నలిజం వృత్తితో సంబంధం లేని వ్యక్తులు ఉపాధికోసమో, ఆర్థిక ప్రయోజనాలకోసమో చౌకబారు కథనాలకు పాల్పడడం మంచి పరిణామం కాదన్నారు. తప్పనిసరిగా సోషల్ మీడియాకు నియంత్రణా వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రింట్ మీడియాలో ఒక సమాచారాన్ని ప్రచురించే ముందు నిర్ధారణ చేసుకునే వ్యవస్థ ఉంటుందని, . కానీ ఎలాంటి స్వీయ నియంత్రణ లేని కొద్దిమంది జర్నలిస్టుల పేరుతో వ్యక్తుల క్యారెక్టర్‌ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, కథనాలను ఇవ్వడం సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు. నిజానికి సోషల్ మీడియా నేటి సామాజిక పరిస్థితుల్లో ఒక అద్భుతమైన వెపన్ లాంటిదని, ఆ ప్లాట్‌ఫారంపై చాలా ఉద్యమాలే జరిగాయని, ఇటలీలో ఒక పెద్ద శక్తిగానే అవతరించిందని, అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ రంగం చౌకబారుగా వ్యవహరించడం సమాజ ఆరోగ్యానికి మంచిది కాదన్నారు. తీన్మార్ మల్లన్న ఇటీవల చేసిన వ్యాఖ్యలు సమర్ధనీయం కాదని, గతంలో ప్రభుత్వ వైఫల్యాలు, సమాజంలోని పెడ ధోరణులు, ప్రజల సమస్యలు లాంటి అనేక అంశాలపై మాట్లాడినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని గుర్తుచేశారు. ఇటీవలి కాలంలో యూట్యూబ్ ఛానెళ్ళు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయని, దానికి యజమాని ఎవరో, దానికున్న ఆబ్జెక్టివ్ ఏమిటో అయోమయంగా ఉన్నదని, అందువల్లనే సమాజానికి చేటుచేస్తున్న కొన్ని చానెళ్ళపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందని గుర్తుచేశారు. జర్నలిస్టు విలువలతో సోషల్ మీడియాను నిర్వహించేవారిని ప్రభుత్వం గుర్తించి అక్రెడిటేషన్ కార్డులు కూడా ఇస్తున్నదని, కేటగిరీలుగా విభజించి నిబంధనల్లోనే డిజిటల్ మీడియాకు కూడా తగిన ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తున్నదని వివరించారు. నిజమైన మీడియాకు, సోషల్ మీడియాకు మధ్య గ్యాప్‌ను తగ్గించాల్సి ఉన్నదని, ఇందుకోసం సంప్రదింపులు, సంభాషణ జరగాలన్నారు.
పోలిటిక్స్‌లో ఉన్నవారికి, బాధితులకు, స్టేక్ హోల్డర్స్‌కు మధ్య జరగాలన్నారు. నిర్దిష్టమైన పాలసీ కూడా రావాల్సిన అవసరం ఉందన్నారు. చౌకబారు కథనాలను, విమర్శలను ఆపకపోతే భవిష్యత్తులో దేశం అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఫేక్ న్యూస్ నిజమని భావించే పరిస్థితి తలెత్తుతుందని, ఇందుకోసం కంట్రోలింగ్ వ్యవస్థతో పాటు స్వీయనియంత్రణ కూడా అవసరమన్నారు. యూట్యూబ్ ఛానెళ్ళు, వెబ్‌సైట్లలో వాడుతున్న భాష, అశ్లీలం, బాడీ షేమింగ్, విద్వేషాలను రెచ్చగొ్టడం, ఉద్దేశపూర్వకంగా బురదజల్లడం, అసత్యాలను ప్రచారం చేయడం, కాసుల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం వార్తలను వండి వార్చడం, రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం. ఇలాంటివన్నీ నియంత్రణలో ఉండాలన్నారు. రాజ్యాంగం 19-ఏ అధికరణంలో కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ అవసరమేకానీ, దుర్వినియోగం చేసినప్పుడు కంట్రోల్ చేయడం సమాజహితానికి అవసరమని అల్లం నారాయణ అభిప్రాయపడ్డారు.