భారత్ లోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 358 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, వారిలో 114 మంది కోలుకున్నారు. ఇంకా 244 యాక్టివ్ కేసులున్నాయి. త్వరలో కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఒమిక్రాన్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకునేందుకు సమాయత్తమవుతోంది.

పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు 2022 ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి మొదటి వారం నాటికి దేశంలో కరోనా మూడో వేవ్ పతాకస్థాయికి చేరుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. అటు, పలు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రచారాన్ని వాయిదా వేయాలని, ఎన్నికలను కూడా రెండు నెలలు వాయిదా వేయాలని అలహాబాద్ హైకోర్టు సూచించింది. ఎన్నికలు, వాటి ప్రచారాల కంటే మనుషుల ప్రాణాలు ముఖ్యమని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో సోమవారం సమావేశం అవ్వాలని ఈసీ నిర్ణయించింది. దేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ కేసుల సరళి, తదితర అంశాలను చర్చించనుంది.