రాయల్ పోస్ట్ ప్రతినిధి హైద్రాబాద్: తెలంగాణలో ఒమిక్రాన్‌ కారణంగా మొట్టమొదటిసారి ఓ గ్రామంలో లాక్ డౌన్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవలే గల్ఫ్ నుండి వచ్చిన వ్యక్తికి మూడు రోజుల క్రితం ఒమిక్రాన్ వేరియంట్ నిర్థారణ అయింది. దుబాయ్ నుండి స్వగ్రామం గూడెంకు వచ్చిన వ్యక్తిని హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. బాధితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.అతని కుటుంబ సభ్యులతో పాటు మరో 64 షాంపిల్స్ వైద్యాధికారులు సేకరించారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి తల్లికి, భార్యకు కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ చేశారు. అయితే వీరిలో ఒమిక్రాన్ లక్షణాలు మాత్రం లేవని తెలిపారు. వీరి నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. దీంతో గ్రామాన్ని పదిరోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ చేస్తున్నట్లు ఆ గ్రామ పంచాయితీ తీర్మాణం చేసింది.తెలంగాణలో నిన్న అత్యధికంగా 14 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన మొత్తం 12మందికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. లేటెస్ట్ ఒమిక్రాన్ లెక్కలతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన 12మందిలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ను గుర్తించారు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.ఇప్పటివరకు నిర్ధారణ అయిన 38 ఒమిక్రాన్ కేసులలో ఆరుగురు మాత్రమే హై రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు కాగా, మిగిలినవారు ఒమిక్రాన్ రిస్క్ లేని దేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. వీరంతా కెన్యా, సోమాలియా, బ్రిటన్, ఘనా, టాంజానియా, దోహా, అబుదాబి లాంటి దేశాల నుంచి వైద్య చికిత్సల నిమిత్తం హైదరాబాదు వచ్చినవారే కావడం గమనార్హం.