రాయల్ పోస్ట్ ప్రతినిధి బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞానకేంద్రంలో జాతీయ రైతుదినోత్సవం సందర్భంగా జరిగిన రైతు సదస్సుకు ముఖ్యఅతిథిగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లిలో ని కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. రైతులు వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని ఆయన సూచించారు. గత ప్రభుత్వాలు రైతులను, వ్యవసాయ రంగాన్ని విస్మరించాయని తెలిపారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతులకు ముఖ్యమైనటువంటి నీరు, 24 గంటల కరెంటు, పెట్టుబడి సాయాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతుంది కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు తమ దృష్టిని సారించాలని ఆయన కోరారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాజేశ్వర్ నాయక్ రైతులకు వ్యవసాయంలో నూతన సాంకేతిక విధానంపై అవగాహన కల్పించడం జరిగింది. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి-సురేష్, స్థానిక సర్పంచ్ లక్ష్మీ-అశోక్ , కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం డైరెక్టర్ రాజేశ్వర్ నాయక్ , మంచిర్యాల, కొమురం భీమ్ జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు వినోద్ , శ్రీనివాస్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు, DRDO PD శేషాద్రి , జిల్లా పశువైద్యాధికారి, ఇతర అధికారులు, శాస్త్రవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.