చేవెళ్లలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు పెద్దఎత్తున తరలిన కాంగ్రెస్

రాయల్ పోస్ట్ ప్రతినిధి : షాద్ నగర్, సిటీటైమ్స్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనంలోకి వెళ్లాలని అధిష్టానం నిర్ణయించడంతో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో చేవెళ్లలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిత్యావసర సరుకుల ధరలకు వ్యతిరేకంగా చేపట్టిన పాదయాత్రకు పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్లారు. షాద్ నగర్ చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సుమారు 150 వాహనాలకు పైగా నిరసనకు తరలినట్టు శంకర్ సిటీటైమ్స్ కు వివరించారు. దేశంలో రోజురోజుకూ పెరిగిన నిత్యావసర ధరల పెరుగుదల, భూ సంస్కరణలే ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ప్రజల్లోకి కాంగ్రెస్ వెళ్తుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టేలా పాదయాత్రకు సిద్దమైనట్టు చెప్పారు. ఇవాళ చేవళ్ల నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారనీ ఈ పాదయాత్రకు సీడబ్యూసీ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్టు తెలిపారు. రాహుల్, ప్రియాంక గాంధీలకు సంఘీభావంగా.. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, నిత్యావసర ధరల పెరుగుదల , భూసంస్కరణలపై పోరుకు కాంగ్రెస్ అధిష్టానం పిలుపు ఇచ్చిందని తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు పాదయాత్రలకు దిగారనీ ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు సైతం పాదయాత్రకు పూనుకున్నారని ఈ నేపథ్యంలో వారికి సంఘీభావంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళనలకు దిగుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారని వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు.
చేవెళ్లలో రేవంత్ రెడ్డి, ఖమ్మంలో భట్టి, సంగారెడ్డిలో జగ్గారెడ్డి పాదయాత్ర
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్ర చేపట్టినట్టు వివరించారు. చేవెళ్ల మండలం ముడిమ్యాల చౌరస్తా కూడలిలోని డా.బీ.ఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి పాద‌యాత్ర ప్రారంభ‌మై
చేవెళ్లలోకి ఇంధిరాగాంధీ విగ్రహం వరకు వరకు పాదయాత్ర కొనసాగనుందని తెలిపారు. సుమారు 10 కి.మీ మేర సాగే ఈ పాదయాత్రలో షాద్ నగర్ నియోజకవర్గం నుండి అన్ని మండలాల నుండి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని తెలిపారు..