ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక లోపాలను సవరించి, ఉచితంగా రీవాల్యుయేషన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి…

– ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుట్నాల సాయికుమార్ డిమాండ్

రాయల్ పోస్ట్ ప్రతినిధి షాద్ నగర్: ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక లోపాలను సవరించి, ఉచితంగా రీవాల్యుయేషన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుట్నాల సాయికుమార్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ షాద్ నగర్ శాఖ ఆధ్వర్యంలో శనివారం విజేత జూనియర్ కాలేజిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన తెరాస సర్కారు నేడు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాల్లో గందరగోళంతో లక్షల విద్యార్థుల మానసిక క్షోభకు, ఆత్మహత్యలకు కారణమైంది. కరోనా సమయంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహణలో కేవలం ప్రకటనలకే పరిమితమై విద్యార్థులకు క్లాసులు నిర్వహించడంలో విఫలమైన ప్రభుత్వం, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిలబస్ పూర్తి చేయకుండానే ఆకస్మికంగా పరీక్షలు నిర్వహించడంతో  అయోమయంతో విద్యార్థులు గందరగొళానికి గురై నష్టపోయారు. మునుపెన్నడూ లేనంతగా కేవలం 49% శాతం ఉత్తీర్ణత సాధించడం, ప్రతిభ కలిగిన అనేక మంది విద్యార్థులు ఫెయిల్ అయిన పరిస్థితి గమనిస్తే పేపర్ వాల్యుయేషన్, అదేవిధంగా సాంకేతిక పరమైన లోపాలున్నట్లు స్పష్టమవుతుంది. పేపర్ వాల్యుయేషన్ లో జరిగిన అవకతవకల వల్ల విద్యార్థులు నష్టపోయి ఆందోళనలో ఉన్నారని, కావున విద్యార్థులందరికి మరోసారి ఉచితంగా రీవాల్యుయేట్ నిర్వహించాలని ABVP తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తోందన్నారు. వేల మంది విద్యార్థులు సింగల్ డిజిట్ మార్కులకే పరిమితమాయ్యరంటే గతంలో జరిగిన విధంగానే మరోసారి సాంకేతిక లోపాలున్నట్లు లోపాలు స్పష్టమవుతున్నందున ప్రభుత్వం మరోసారి ఫలితాలను పునః పరిశీలించి పారదర్శకంగా ఫలితాలు ప్రకటించి విద్యార్థులకు న్యాయం చేయాలని, ఫలితాల విడుదలకు ముందే ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ఉత్తీర్ణతా శాతం పై సమాచారం ఉన్నప్పటికీ విద్యార్థులను ఫలితాలకనుగుణంగా సిద్ధం చేయకుండా కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. విద్యార్థులు ఉద్వేగానికి లోను కాకుండా దైర్యంగా ఉండాలని ఫలితాలల్లో జరిగిన  లోపాలను సరిచేసేంత వరకు ABVP విద్యార్థుల పక్షాన నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, సందీప్, బిక్షపతి, అభిషేక్, జగదీష్, అజయ్, వంశీ, ప్రశాంత్, బాను, అభి, శ్రీధర్, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.