రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: అంగన్వాడీ కేంద్రాల విలీనం తక్షణమే ఉపసంహరించుకోవాలని, పెంచిన పీఆర్సీ వేతనాలు ఇతర సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం రోజున స్థానిక సుందరయ్య భవన్లో జరిగిన అంగన్వాడీ యూనియన్ జిల్లా కమిటీ సమావేశంలో చంద్రారెడ్డి మాట్లాడుతూ ఐసీడీఎస్ బాధ్యతనుండి రాష్ట్రప్రభుత్వం క్రమంగా తప్పుకోవాలని చూస్తున్నదని, అందులో భాగంగానే 14 వేల అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లోకి తరలించాలని 2021 నవంబర్ 9 న జరిగిన సమావేశంలో స్త్రీశిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ అధికారులు నిర్ణయం చేశారని అన్నారు. ఇలా చేస్తే 40 కోట్ల అద్దె భారం తగ్గుతుందని ప్రభుత్వం చెబుతున్నదన్నారు. ప్రభుత్వం చెబుతున్న వాదన సరైంది కాదన్నారు. ఇది కేవలం అద్దె భవనాల పేరుతో ఐసీడీఎస్ లో నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయడం ద్వారా ఐసీడీఎస్ ను నిర్వీర్యం చేయడం తప్ప మరొకటి కాదన్నారు. ఈ చర్య వల్ల అంగన్వాడీ ఉద్యోగులతోపాటు పేద ప్రజలకు నష్టం కలుగుతుందన్నారు. ఐసీడీఎస్ ఏర్పడి నలభై ఆరు సంవత్సరాలు దాటిందని గుర్తుచేశారు. ఈ కాలంలో అంగన్వాడీ కేంద్రాలన్నింటికీ పక్కా భవనాలు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దాన్ని విస్మరించి నేడు అద్దె కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వ పెద్దలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏళ్ళ తరబడి పెండింగ్లో ఉన్న టీఏ- డీఏలు, యూనిఫామ్స్, రేషన్ షాపుల నుండి తీసుకుపోయే బియ్యానికి సంబంధించిన రవాణా ఛార్జీలు ఇవ్వాలన్నారు. కార్గో వాహనం ద్వారా అందిస్తున్న ఫుడ్డు ను మెయిన్ రోడ్డు మీద కాకుండా నేరుగా సెంటర్ల వద్దకు అందజేయాలన్నారు. వెంటనే కేంద్రం పెంచిన వేతనాలను చెల్లించాలన్నారు. అదేవిధంగా స్టేషనరి ఇతర రికార్డ్సు సరఫరా చేయాలన్నారు. అంగన్వాడీలపై అధికారుల, రాజకీయ నాయకుల వేధింపులు ఆపాలన్నారు. పైన పేర్కొన్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 20 న జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాలో అంగన్వాడీలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం ఐసిడిఎస్ పిడి ఆఫీసులో సోమేశ్వర్ కు 20 న జిల్లా కలెక్టరేట్ ముందు జరుగు ధర్నాలో ఆరోజు అంగన్వాడి సెంటర్స్ లాక్ చేసి అంగన్వాడీలందరు పాల్గొంటారని తెలుపుతూ వినతిపత్రం సమర్పించారు. జిల్లా కమిటీ సమావేశానికి యూనియన్ జిల్లా నాయకురాలు మంజుల అధ్యక్షత వహించగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలువేరు రమాకుమారి నాయకులు శోభ, జంగమ్మ, సునీత, నాగమణి, భువనేశ్వరి, రమణ, సునంద, మంగాలు, అలివేలు, సునీత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు