రాయల్ పోస్ట్ ప్రతినిధి సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ ,డిసెంబర్ ,9 : మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ ఆధ్వర్యంలో గురువారం నాడు స్థానిక వశిష్ఠ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల ఫోరమ్, మోటారు వాహనాల చట్టం, బాలకార్మిక నిర్మూలన చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, సైబర్ క్రైమ్, ఉచిత న్యాయసేవా సహాయం మరియు లోక్ అదాలత్ పై సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మెన్ శ్రీ.డి.దుర్గాప్రసాద్ గారు విద్యార్థులకు తెలియజేసారు. విద్యార్థులందరు సమయపాలనను పాటించి, చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలని అధిరోహించాలని, తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని, ఎలాంటి తప్పులు చేయకూడదని సూచించారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ప్రతీ శనివారం ఉచిత న్యాయ సేవా సహాయకులు అందుబాటులో ఉంటారని ఏ సమస్య గురించి అయినా వారిని సంప్రదించవచ్చని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్, కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.