.

రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వయోవృద్ధుల, దివ్యాంగుల జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వయో వృద్ధుల కోసం కౌన్సెలింగ్ నిర్వహించడానికి అవసరమయ్యే సైకాలిజిస్టులకు ప్రత్యేక ఇంటర్న్షిప్ కల్పించి నియమిస్తామని తెలిపారు. ట్రిబ్యునల్ లో తీర్మానం కాని ప్రత్యేక కేసులను కూడ తమ స్థాయిలో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి మండలంలో వయోవృద్దుల సమస్యలు పరిష్కరించబడే విధంగా మండల స్థాయి అధికారుల కమిటీల ఏర్పాటుతో త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వృద్ధుల హక్కులకు ఎలాంటి భంగం కలిగించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వయో వృద్దులెవరైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే 14567 కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. కుటుంబ సభ్యులచే నిరాదరణకు గురైన వారి పోషణ భ్రృతి కోసం రెవిన్యూ డివిజన్ స్థాయిలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భువనగిరి, చౌటుప్పల్ రెవిన్యూ డివిజనల్ అధికారుల ట్రిబ్యునల్స్ లో కేసులు తగ్గుముఖం పట్టినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేక కేసులు ఉంటే కమిటీ దృష్టికి తేవాలని, పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని వయోవృద్ధుల సంఘం సభ్యులకు సూచించారు.
దివ్యాంగుల సంక్షేమం గురించి మాట్లాడుతూ, నిబంధనల మేరకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, వివాహ ప్రోత్సాహకాలు, ఆర్ధిక పునరావాస క్రింద బ్యాంకు లోన్లు, అర్హులైన వారికి బ్యాటరీ ఆపరేటర్ వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, తదితర ఉపకరణాలు పంపిణీ చేయడం జరుగుతున్నదని తెలిపారు. వారికి అందజేసే పెన్షన్లు, వివిధ పథకాల ఆర్థిక సహాయం ఖచ్చితంగా అమలు అయ్యేలా చూడడం జరుగుతుందన్నారు. దివ్యాంగులకు ఉపాధి హామీ పనుల్లో, అంత్యోదయ కార్డులు, సదరం సర్టిఫికేట్ల జారీలో ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన దివ్యంగులకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక మీ సేవ సెంటర్ ఏర్పాటు చేసి సహయకుడిని నియమిస్తామని తెలిపారు. దివ్యాంగుల అవసరాల నిమిత్తం 1800 572 8290 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు దివ్యాంగ వృద్ధుల సంక్షేమ అధికారి శ్రీమతి కృష్ణవేణి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి, వాటి అమలు, కమిటీ ఏర్పాటు, విధానాల గురించి వివరించారు.తొలుత బుధవారం నాడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి CDS బిపిన్ రావత్ సహా 13 మంది సైనికాధికారులకు సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.కమిటీ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి కృష్ణారెడ్డి, ఏసీపీ వెంకట్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివరావు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, FRO తిరుపతి రెడ్డి, ఫిజియో థెరపిస్ట్ శివ కుమార్, వయోవృద్ధుల, దివ్యాంగుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.