పంటల మార్పిడి విధానంతో రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి రైతులకు సూచించారు.

రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ 7/బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో, తదుపరి బొమ్మలరామారం మండలం నాగిరనేనిపల్లి గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతు అవగాహన సదస్సు కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వచ్చే యాసంగి వరి ధాన్యం ఎఫ్.సి.ఐ. కొనుగోలు చేయనన్నందున రైతులు పంటల మార్పిడి విధానం ద్వారా ఆరుతడి పంటలతో తమ ఆదాయాన్ని పెంచుకోవాలని రైతులకు సూచించారు. సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని, గడ్డి కోత మిషన్ వంటి చిన్న పరికరాలను సబ్సిడీపై అందించాలని రైతులు జిల్లా కలెక్టర్ ను కోరారు. వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని కలెక్టర్ వారికి తెలిపారు. హైదరాబాద్ వంటి మహా నగరానికి దగ్గర్లో ఉన్నందున కూరగాయలు, పూలు వంటి పంటలపై రైతులు దృష్టి పెట్టాలని, వాటికి చాలా డిమాండ్ ఉందన్న విషయం రైతులు గమనించాలని తెలిపారు. రైతులు తమ అభివృద్ధి కోసం రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా పంటల సాగుపై స్పష్టమైన అవగాహన పెరుగుతుందని, మనో బలం చేకూరుతుందని అన్నారు.
కార్యక్రమాలలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి అనురాధ, జిల్లా ఉద్యానవన అధికారి శ్రీమతి అన్నపూర్ణ, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.