రాయల్ పోస్ట్ ప్రతినిధి జహీరాబాద్ ,7 డిసెంబర్ :మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ శనివారం స్థానిక కోర్ట్ కాంప్లెక్స్ లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగ్గ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కారం అయ్యేలా చూడాలని సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ శ్రీ డి. దుర్గాప్రసాద్ గారు తెలిపారు. మంగళవారం స్థానిక జహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో మాట్లాడుతూ లోక్ అదాలత్ వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు తెలియజెప్పి రాజిమార్గం ద్వారా కేసులు సత్వర పరిష్కారం చేసుకునేలా చూడాలని గ్రామ కార్యదర్శిలకు, సర్పంచులకు, వార్డు మెంబర్లకు, పోలీసులకు సూచించారు. క్షణికావేశంలో చేసిన తప్పిదాలతో విలువైన సమయం, డబ్బు వృధాచేసుకోకుండా రాజీ మార్గాన్ని ఎంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. లోక్ అదాలత్ లో రాజీ పడిన కేసులకు అప్పీల్ ఉండదని దీనిని అందరూ గ్రహించాలని, రాజీ మార్గమే రాజమార్గమని, దీనిని అందరూ గుర్తించాలని కోరారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ దత్తాత్రేయ రెడ్డి, సీనియర్ అడ్వకేట్ మానెన్న, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్, డిఎస్పీ శంకర్ రాజు మరియు పోలీసు అధికారులు, గ్రామ సర్పంచులు, కార్యదర్శులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.