రాయల్ పోస్ట్ న్యూస్ ఓయూ హైదరబాద్:
ఆచార్యులతో కళకళలాడాల్సిన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఖాళీలతో వెలవెలబోతున్నాయని
తెలంగాణ రాష్ట్ర బిఎస్పీ సమన్వయకర్త డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సెంట్ర‌ల్ లైబ్రరీ ని సంద‌ర్శించిన ఆయన విద్యార్థులు, పరిశోధకులు, నిరుద్యోగుల‌తో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. ఏళ్ల తరబడి ఆచార్యుల ఖాళీలను భర్తీ చేయకపోవడం,పదవీ విరమణ పొందుతున్న వారి స్థానాలను అలాగే వదిలేస్తుండటంతో బోధన ప్రమాణాలు నానాటికీ పడిపోతున్నాయని ఆవేదన ఏం చేశారు. ఎంతో మంది యువ‌త తెలంగాణ ఉద్య‌మం కోసం ఆత్మ‌బ‌లిదానం చేసుకుంద‌ని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు ఉద్యోగాల కోసం బ‌లిదానం చేసుకోవాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. రాజ‌కీయ ల‌బ్ది కోసం నేను ఇక్కడకు రాలేదని, ఉద్య‌మ ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థులకు బిఎస్పీ ఎప్పుడు అండ‌గా ఉంటుంద‌ని, విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకొని, త‌ల్లిదండ్రుల‌కు క‌డుపు కోత మిగిల్చ‌వ‌ద్ద‌ని విన్నవించారు.
ఈ సందర్బంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు తమ సమస్యలను పెట్టారు. స్పందించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ,ఎస్టీ, బిసి,మైనారిటీలకు రిజర్వేషన్లను తొలగించి తీరని అన్యాయం చేసిందని ఘాటుగా విమర్శించారు. బిఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్య,వైద్య,ఉపాధి అవకాశాలు సృష్టిస్థామని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు, రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలను ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.