రాయల్ పోస్ట్ న్యూస్ నిజామాబాద్:ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి కల్వకుంట్ల కవిత ఖరారు అయ్యారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటలో ఆమెను ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు కవిత నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల కోటాలోనే ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. త్వరలో ఆమె పదవి కాలం ముగియనుండటంతో గులాబీ బాస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమెను బరిలో దింపుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో సీఎం కేసీఆర్ ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన చేసిన విషయం తెలిసిందే.

కాగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో కవిత ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉన్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో అనర్హత వేటుపడింది. దీంతో ఆ స్థానం ఖాళీ కావడంతో అక్కడి నుంచి కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఆమె పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 4తో ముగియనుంది. ఇప్పటికే స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి ఆమెకు అవకాశం దక్కింది.