రాయల్ పోస్ట్ న్యూస్ షాద్ నగర్, : నల్ల వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కు తగ్గడం ముమ్మాటికీ దేశ రైతాంగ, ప్రతిపక్ష విజయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
దేశానికి వెన్నెముకైన రైతు కన్నెర్రజేస్తే ఎంతటి నియంతైనా దిగిరాక తప్పదు అనడానికి ఇదే రైతు ఉద్యమం నిదర్శనమన్నారు. రైతాంగ పోరాట చరిత్రలో ఇదొక చారిత్రక విజయమన్నారు. ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ఆనాడు దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు చేసినా రైతుల సంకల్పం ముందు అవి తునాతునకలయ్యాయన్నారు. నల్ల చట్టాలకు నిరసనగా దీక్షలు చేపడితే కేసీఆర్ ప్రభుత్వం తమను పోలీసుల ద్వారా వేదించారని గుర్తుచేశారు. అయినా పట్టిన పట్టు విడవకుండా రైతాంగానికి అండగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో దేశ వ్యాప్తంగా, అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో భారీ నిరసన, ధర్నా, సత్యాగ్రహం, రైతు దీక్ష, ముట్టడి లాంటి కార్యక్రమాలతో కేంద్రం మెడలు వంచామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం ముందే కళ్లు తెరిచి ఉంటే ఉద్యమంలో వందల మంది రైతుల ప్రాణాలు పోయేవి కావన్నారు. దేశంలో తద్వారా రాష్ట్రంలో ఇతర ప్రజా సమస్యలపై పోరాటానికి రైతు ఉద్యమం స్ఫూర్తినిచ్చిందన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్‌ కూడా దిగిరాక తప్పదన్నారు. ప్రతి గింజా కొనే వరకు వదలబోమన్నారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు గ్రామాల్లో రైతుల కల్లాల్లో కాంగ్రెస్ పార్టీ వరి ధాన్యాన్ని పరిశీలిస్తుందని ఇటీవలే చించొడ్ గ్రామంలో వడ్ల పరిస్థితిని పరిశీలించామని మీడియాకు తెలిపారు. కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కేడి ఇద్దరు జతగూడి వడ్ల కొనుగోలు పై కొత్త డ్రామాలు ఆడుతున్నారని, త్వరలోనే వారి డ్రామాలకు తెర దించుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం అనంతరం చౌరస్తాలో అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నల్ల చట్టాల రద్దుపై టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్, పిసిసి మెంబర్ బాబర్ ఖాన్, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కే. చెన్నయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, జగదీష్ అప్పా, కిసాన్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, నందిగామ ఎంపిటిసి కొమ్ము కృష్ణ, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీశైలం, కొందుర్గు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, చౌదరిగుడా మండల అధ్యక్షుడు రాజు, ఎస్బి పల్లి సర్పంచ్ ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అందే మోహన్, మసూద్ ఖాన్, ముబారక్, గిరి, పులిమామిడి రాజేష్, వంశీ, గంగమోని సత్తయ్య, సుదర్శన్, అశోక్, రాజు, నవీన్, బుడ్డ నరసింహ, మాణిక్యం, రాజేష్ తదితరులు పాల్గొన్నారు..