రాయల్ పోస్ట్ మంచిర్యాల: కొవిడ్ వ్యాక్సినేషన్ లో మొదటి, రెండు డోసుల కార్యక్రమం సంబంధిత అధికారుల సమన్వయంతో 100 శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో వ్యాక్సినేషన్ ప్రధాన పాత్ర వహిస్తుందని, ఈ మేరకు జిల్లాలోని అర్హులైన అందరికీ రెండు రోజుల వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని తెలిపారు. ఉపాధిహామీ కార్యక్రమంలో ఉపాధి భాగంగా కూలీల సంఖ్య పెంచాలని, సగటున ప్రతి గ్రామంలో 30 మందికి ఉపాధి కూలీలకు పని కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా 2021-22 సంవత్సరానికి గాను ప్రతి గ్రామపంచాయతీలో నర్సరీలను ఏర్పాటు చేసి గేట్, ఇతర సౌకర్యాలు కల్పించాలని, ఎర్ర మట్టి కొనుగోలు చేసి ఖాళీ బ్యాగులలో నింపాలని, జిల్లా పరిధిలోని జాతీయ, రాష్ట్రీయ రహదారులు, అంతర్గత రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి పరిరక్షించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని తెలిపారు.