ఖమ్మం జిల్లా వాసి రవికాంత్ పిటిషన్‌పై అత్యవసర విచారణ

మద్యం దుకాణాలకు కేటాయింపులో రిజర్వేషన్లకు ప్రాతిపదిక ఏమిటో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లను సవాల్ చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన వాసిరెడ్డి రవికాంత్, నంద్యాల ప్రభాకర్ రావు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్​పై జస్టిస్ లక్ష్మణ్ అత్యవసర విచారణ చేపట్టారు.

రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం..

మద్యం దుకాణాల లైసెన్సుల మంజూరులో గౌడ కులస్తులకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించారు. కులాల వారీగా రిజర్వేషన్లు ఉండొద్దని గతంలో సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చిందని వివరించారు. మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలును నిలిపివేయాలని కోరారు.

ఎల్లుండికి వాయిదా..

పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వాన్ని సంప్రదించి ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చారో లిఖితపూర్వకంగా తెలపాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని ఆదేశించింది. తదుపలి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. రాష్ట్ర సర్కారు తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ ప్రకారం.. గౌడలకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం దుకాణాలు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది. జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపులు చేయనున్నట్లు తెలిపింది. దరఖాస్తు రుసుము గతంలో మాదిరిగానే రూ.2 లక్షలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దుకాణాల కేటాయింపుల్లో పాత స్లాబులే కొనసాగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.