రాయల్ పోస్ట్ మంచిర్యాల: వానాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద భాజపా కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు. తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంచిర్యాల, కరీంనగర్‌, నల్గొండ, రంగారెడ్డి సహా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద భాజపా శ్రేణులు ఆందోళనలకు దిగాయి.

తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద భాజపా ధర్నాలు

ధాన్యం కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకుండా రైతుల్ని ఇబ్బందులకు గురిచేస్తోందని భాజపా నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు తెరాస నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనాల్సిందేనని.. అప్పటి వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు..కార్యక్రమంలో బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…