అక్రమంగా వెలుస్తున్న నిర్మాణాలు

కాసిపేట: బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం (అకెనపల్లి)లో అసైన్డ్‌ భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. అధికారులకు కాసులు ముట్టజెపుతూ చేస్తున్న అక్రమాలను కాగితాలపై సక్రమం చేసుకుంటున్నారు. నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం(అకెనపల్లి) శివారు మసీదు పక్కనున్న అసైన్డ్‌ భూముల్లో ఇదివరకు ఓ సామాజిక వర్గానికి చెందినవారు నివాసాలు ఏర్పాటు చేసుకుంటే ఆర్డీవో స్థాయి అధికారులు వచ్చి దగ్గరుండి నిర్మాణాలను కూల్చివేశారు. కాగా అనంతరం కొద్దిరోజులకే కొందరు అక్రమార్కులు అధికారులను మచ్చిక చేసుకొని కాగితాలపై వెంచర్లు వేసి విక్రయాలు జరుపుతున్నారు.
గుంటకు రూ.లక్షల్లో
సోమగూడెం నుంచి బెల్లంపల్లి మీదుగా జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుండటంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చాయని స్థానికులు అంటున్నారు. అక్రమ నిర్మాణాలు అయినప్పటికీ గుంటకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ధర పలుకుతున్నట్లు సమాచారం. పేదలు నిర్మాణాలు చేపడితే అధికార యంత్రాంగం కదిలివచ్చి వాటిని కూల్చివేశారని.. రాజకీయ పలుకుబడి ఉన్నవారు రూ.లక్షల్లో ముడుపులు ముట్టజెపుతూ యథేచ్ఛగా అక్రమ కట్టడాలు చేపడుతున్నారని పలువురు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గత ఆరునెలల వ్యవధిలో అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నాయి. కొన్నిచోట్ల ఇది వరకు అమ్మిన భూములనే మళ్లీ వేరొకరికి విక్రయించడంతో గొడవలు సైతం జరిగాయి. ఈ వివాదాలు పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లిన సందర్భాలున్నాయి. ‘ గతంలో అసైన్డ్‌ భూముల్లో స్థానికులు కొందరు చిన్నపాటి నివాసాలు ఏర్పాటు చేసుకుంటే అధికారులు కూల్చివేసి, వారిని వెళ్లగొట్టారు. ఇప్పుడు అక్రమార్కులు వెంచర్లు వేసి నిర్మాణాలు చేపడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు..’..అని గ్రామస్థుడు శంకర్‌ వాపోయాడు.